Jammu Kashmir Elections Congress Manifesto : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఎలక్షన్స్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ తాజాగా తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. విజయం సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తోన్న కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకొనేందుకు పలు హామీలతో ఈ మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది.
శ్రీనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా, పీసీసీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఈ మేనిఫెస్టోను ప్రజల ముందుంచారు. రైతులు, యువత సంక్షేమమే లక్ష్యంగా పలు హామీలను అందులో పొందుపరిచారు.
- ఈ ఎలక్షన్స్‌లో తమ పార్టీ విజయం సాధిస్తే అన్ని పంటలకు బీమా కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ అలాగే కిలో యాపిల్‌కు కనీస మద్దతు ధర రూ.72 చొప్పున ఇస్తామని కూడా ప్రకటించింది.
- భూమిలేని, కౌలుదారులకు ఏడాదికి అదనంగా రూ. 4 వేలు ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది.
- ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న భూమిలేని రైతులకు 99 ఏళ్ల లీజును కూడా ఇస్తామని వెల్లడించింది.
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపింది.
- అర్హులు అయినవారికి నెలకు రూ.3500 చొప్పున నిరుద్యోగ భృతి కూడా ఇస్తామమని ప్రకటించింది.
- రైతులకు 100 శాతం సాగు నీరందేలా అన్ని జిల్లా స్థాయి నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.2,500 కోట్ల నిధిని ప్రకటిస్తామని హామీ ఇచ్చింది.