Jammu Kashmir Car Accident :జమ్ముకశ్మీర్ రంబాన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి లోయలో పడిపోయిన ఘటనలో పది మంది మృతి చెందారు. ఈ వాహనం శ్రీనగర్ నుంచి జమ్మూకి వెళ్తుండగా, బ్యాటరీ చెష్మా ప్రాంతంలో తెల్లవారుజామున 1.15 గంటలకు 300 అడుగుల లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌డీఆర్‌ఎఫ్), సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీనగర్ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ సహాయక బృందాలు 10 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికితీశాయి. కారు డ్రైవర్‌ను జమ్మూలోని అంబ్ ఘ్రోథాకు చెందిన బల్వాన్ సింగ్ (47)గా గుర్తించారు. మృతుల్లో బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందిన విపిన్ ముఖియా భైరాగాంగ్ అనే వ్యక్తి కుడా ఉన్నారు. గతేడాది నవంబర్ 15న జమ్ములోని దోడా జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 39 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు.
వాహనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు- ఇద్దరు మృతి
Truck Accident News Today :మరోవైపు దిల్లీ-సహారన్‌పూర్ హైవే సమీపంలో ఉన్న థానాభవన్ పట్టణంలో బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల అదుపుతప్పిన ఓ ట్రక్కు, పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.