Sharon Raj Murder Case Verdict : 2022లో సంచలనం సృష్టించిన 23 ఏళ్ల రేడియాలజీ విద్యార్థి షారన్ రాజ్ హత్య కేసులో కేరళలోని తిరువనంతపురం న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దోషిగా తేలిన షారన్ రాజ్ ప్రియురాలు గ్రీష్మకు న్యాయస్థానం మరణశిక్షను విధించింది. ఆమెకు సహకరించిన బంధువులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
'షారన్‌కు గ్రీష్మ నమ్మక ద్రోహం చేసింది. కుట్రపూరితంగానే అతడికి ఇచ్చిన జ్యూస్‌లో హానికారక పదార్థాలు కలిపింది. అయినా తన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు యత్నించింది. గ్రీష్మకు షారన్ ఎన్నడు కూడా తప్పుడు మెసేజ్‌లు పంపలేదు. ఆమెపై నిందలు మోపలేదు. షారన్ రెచ్చగొట్టకపోయినా, ఘర్షణకు దిగకపోయినా అతడి ప్రాణాలను గ్రీష్మ తీయడం నేరమే' అని న్యాయస్థానం పేర్కొంది.
'శిక్షను తగ్గించండి'
అయితే తనకు శిక్షను తగ్గించాలని గ్రీష్మ న్యాయస్థానాన్ని కోరింది. ఉన్నత చదువులు చదివానని, ముందు కూడా తనపై ఎలాంటి నేర చరిత్ర లేదని పేర్కొంది. అంతేకాకుండా తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె అని- ఇవన్నీ చూసి తనకు శిక్షను తగ్గించాలని కోర్టును అభ్యర్థించింది. అయితే, న్యాయస్థానం ఈ వాదనలను తోసిపుచ్చింది.
ఇదీ జరిగింది
తిరువనంతపురంలోని పరశాలలో నివసించే షారన్ 2022 అక్టోబర్ 25న మృతి చెందాడు. అయితే షారన్ మృతి పట్ల అనుమానంతో అతని కుటుంబ సభ్యులు తమిళనాడులోని రామవర్మంచిరలోని అతని ప్రేయసి గ్రీష్మపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు గ్రీష్మ తన కుటుంబ సభ్యులతో కలిసి షారన్‌ను చంపినట్లు అంగీకరించింది. తనకు మరో యువకుడితో పెళ్లి కుదిరిందని, అయితే వివాహం జరిగితే మొదటి భర్త చనిపోతాడని జ్యోతిషుడు చెప్పడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపింది. తాను గతంలో ఎవరికీ తెలియకుండా ఓ చర్చిలో షారన్‌ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది.
ప్రణాళిక ప్రకారం 2022 సెప్టెంబర్ 14న తమిళనాడులోని రామవర్మంచిర్లో ఉన్న తన ఇంటికి షారన్‌ను పిలిచింది గ్రీష్మ. అయితే అక్కడ వారు జ్యూస్ తాగే పోటీని పెట్టుకున్నారు. గ్రీష్మ షారన్‌కు ఇచ్చిన జ్యూస్‌లో కాపర్ సల్ఫేట్ కలిపి ఇచ్చింది. అది తాగిన షారన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషం తాగిన కారణంగానే షారన్ మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ విషయాన్ని రుజువు చేసేలా గ్రీష్మ, షారన్ మధ్య వాట్సాప్ చాటింగ్‌లు లభించాయి. ఈ కేసు విషయంలో 2023 జనవరి 25న పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 2024 అక్టోబరు 15న కోర్టులో మొదలైన విచారణ ప్రక్రియ ఈ ఏడాది జనవరి 3న ముగిసింది. ఎట్టకేలకు సోమవారం(జనవరి 20) తీర్పును వెలువరించారు.