Jammu Kashmir Terror Attack: జమ్ముకశ్మీర్‌లో రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై విచక్షణరహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడగా తొమ్మిది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడ్డారు. యాత్రికులంతా కత్రాలోని శివ ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణో దేవి మందిరానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 6.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై రియాసీ ఏసీపీ మోహితా శర్మ మీడియాతో మాట్లాడారు. "ప్రాథమిక నివేదికల ప్రకారం శివ ఖోరీ నుంచి బయలుదేరిన బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. డ్రైవర్ బ్యాలెన్స్ తప్పడం వల్ల వాహనం లోయలో పడిపోయింది" అని తెలిపారు.
25సార్లు కాల్పులు!
బస్సులో లోయలో పడిపోవడానికి ముందు 25 సార్లు కాల్పులు జరిపారని ఓ యాత్రికుడు తెలిపారు. రెడ్ కలర్ మఫ్లర్ ధరించిన ఓ వ్యక్తి బస్సుపై కాల్పులు జరిపిన్నట్లు మరో యాత్రికుడు తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో జమ్ముకశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి. జులై 2017లో కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఏడుగురు యాత్రికులు మరణించారు. 19 మంది గాయపడ్డారు.
ఎవరూ తప్పించుకోలేరు!
"రియాసీలో బస్సుపై జరిగిన ఉగ్రదాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరణించిన వారి కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఉగ్రవాదులను వేటాడేందుకు మా భద్రతా దళాలు, JKP సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి" అని జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడ్డవారెవరూ కూడా తప్పించుకోలేరని కేంద్ర హోంమంత్రి అమిషా హెచ్చరించారు. ఘటనపై ఆరా తీసినట్లు వెల్లడించారు.
ఖండించిన కాంగ్రెస్
మరోవైపు, యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. జమ్మకశ్మీర్‌లో ఆందోళనకరమైన భద్రతా పరిస్థితుల నిజమైన చిత్రాన్ని ఈ సంఘటన ప్రతిబింబిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో స్పందిందారు.
"వివిధ దేశాధినేతల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ప్రమాణస్వీకారం చేసిన వేళ, యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడి వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకారం. ఈ భయంకరమైన ఉగ్రదాడిని మేం ఖండిస్తున్నాం. మూడు వారాల క్రితం పహల్గామ్‌లో పర్యటకులపై కాల్పులు జరిగాయి. అలా జమ్ముకశ్మీర్‌లో అనేక ఉగ్రవాద ఘటనలు నిరంతరం జరుగుతున్నాయి. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలి" అని ఖర్గే డిమాండ్ చేశారు.
సిగ్గుచేటు ఘటనే ఉదాహరణ!
జమ్ముకశ్మీర్‌లో ఆందోళనకరమైన భద్రతా పరిస్థితికి ఈ సిగ్గుచేటు ఘటనే ఉదాహరణ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడం చాలా బాధాకరమని అన్నారు. "మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకతాటిపై నిలబడుతుంది" అని తెలిపారు రాహుల్.