Jamili Elections Bill Synopsis :జమిలి ఎన్నికల బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకు రాగా, విపక్షాలు వ్యతిరేకించడం వల్ల జేపీసీకి పంపడానికి తమకేం అభ్యంతరం లేదని పేర్కొంది కేంద్రం. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీఏ మిత్ర పక్షాలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్ సహా విపక్షాలు అన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి.
జేపీసీకి ONOE బిల్లు- 2034 నుంచే దేశంలో జమిలి ఎన్నికలు! - JAMILI ELECTIONS BILL
జమిలి ఎన్నికలు 2034 నుంచి జరిగే అవకాశం- బిల్లు సారాంశం ఇదే!
Published : Dec 18, 2024, 7:56 AM IST
|Updated : Dec 18, 2024, 9:45 AM IST
అయితే బిల్లు ప్రకారం, దేశంలో జమిలి ఎన్నికలు 2034 నుంచి జరిగే అవకాశముంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్నాక జరిగే సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడే లోక్‌సభ తొలి సిటింగ్ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అపాయింటెడ్ డేగా పిలిచే ఆ రోజు తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు కూడా లోక్‌సభ కాలపరిమితితోపాటే ముగుస్తాయి. ఆ తర్వాత నుంచి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలన్నీ ఏకకాలంలో జరుగుతాయి. లోక్‌సభగానీ, అసెంబ్లీగానీ పూర్తికాలం ముగియక ముందే రద్దయితే వాటికి 5 ఏళ్ల కాలంలో మిగిలిన సమయానికే ఎన్నికలు జరుగుతాయని బిల్లు పేర్కొంది. అందువల్ల జమిలి విధానం 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఆచరణలోకి వస్తుంది. ఉదాహరణకు 2029 మేలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం ఏర్పడే 19వ లోక్‌సభ మొదటి సిటింగ్ తేదీని రాష్ట్రపతి జూన్ 1గా నిర్ధరిస్తే ఆ తర్వాత ఏర్పడే అసెంబ్లీలన్నీ ఆ లోక్‌సభతోపాటే ముగుస్తాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
2004 నుంచి కూడా వాటి ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటే జరుగుతున్నందున 2029, 2034లోనూ అదే విధానం కొనసాగుతుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు తదుపరి అసెంబ్లీ ఎన్నిక 2028 నవంబరు- డిసెంబరులో జరిగి 2033 నవంబరు వరకూ మనుగడలో ఉంటాయి. 2029లో ఏర్పడే 19వ లోక్‌సభ కాలపరిమితి 2034 మేలో ముగియనున్నందున 2033లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు, 2034 లోక్‌సభ ఎన్నికలకు మధ్య ఏర్పడే 6 నెలల వ్యవధికి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 2028 మే, జూన్ నెలల్లో జరిగే కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల అసెంబ్లీలు 2033 మే, జూన్‌లలో ముగుస్తాయి. 2034తో జరిగే లోక్‌సభ ఎన్నికలతో వీటికి ఏడాది వ్యవధి ఉంటుంది కాబట్టి ఆ ఏడాదికే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే వాటికీ రాష్ట్రపతి పాలన అమలు చేస్తారా అన్నది చూడాలి. మిగిలిన రాష్ట్రాల్లోనూ ముందూ వెనుకా ఎన్నికలు ఉండటంతో ఏం చేస్తారన్నది వేచి చూడాలి.