J&K Marks 5th Anniversary Of Article 370 Abrogation : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వరుస ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతాబలగాలను హై అలర్ట్‌లో ఉంచింది. అలాగే సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
జవాన్ల కాన్వాయ్‌లపై దాడి జరిగేందుకు అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారం మేరకు వాటి రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించామని సంబంధిత అధికారులు తెలిపారు. అమర్‌నాథ్ యాత్ర వాహనాలకు కూడా ఇవే ఆంక్షలు ఉంటాయని తెలిపారు. జమ్ములో దాడి ముప్పు పొంచి ఉన్నందున బలగాలు ఒంటరిగా ఉండొద్దని హెచ్చరించారు. అలాగే ఇప్పటికే అదనపు భద్రతా సిబ్బందిని ఆ ప్రాంతానికి తరలించారు. తొలిసారి అసోం రైఫిల్స్‌ను ఈ ప్రాంతంలో మోహరించారు. చొరబాట్లు, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించేందుకు సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే, ఈ ఉదయం నియంత్రణ రేఖ సమీపంలోని అఖ్నూర్, సుందర్‌బనీ సెక్టార్ల వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించారు. దీనితో ఆర్మీ వార్నింగ్ షాట్స్‌ను పేల్చింది. ఆ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపడుతోంది.