ISKCON Monks Arrest :బంగ్లాదేశ్‌లో హిందువులుసహా మైనార్టీల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ తాత్కాలిక ప్రభుత్వం మరో ఇద్దరు సాధువులను అరెస్ట్ చేసింది. జైల్లో ఉన్న చిన్మయ్ కృష్ణదాస్‌కు ఆహారం ఇచ్చి వస్తుండగా సాధువులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తెలిపారు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ కార్యలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
'నవంబర్ 29న చత్తోగ్రామ్ జైలులో ఉన్న చిన్మయ్ కృష్ణదాస్‌కు ఆహారం ఇచ్చేందుకు ఆదిపురు శ్యామ్ దాస్, రంగనాథ్ దాస్ వెళ్లారు. తిరిగి వస్తుండగా వాళ్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణదాస్‌ను కలిసేందుకు వెళ్లిన పూజారి శ్యామ్‌దాస్ ప్రభును శుక్రవారం అక్రమంగా అరెస్టు చేశారు. అంతేకాకుండా ఇస్కాన్ కార్యాలయంను గుర్తు తెలియని దుండుగలు ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లో ఇటువంటి సంఘటనలు ఆగడం లేదు. బంగ్లాదేశ్‌లో ఉంటున్న హిందువుల క్షేమం కోసం ఇస్కాన్ భక్తులు ప్రార్థించాలి' అని రాధారమణ్ కోరారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రత కోసం డిసెంబరు 1న ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేయనున్నట్లు అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) వెల్లడించింది.
ఆర్‌ఎస్‌ఎస్ ఆందోళన
బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. వారికి భద్రత కల్పించాల్సిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆరోపించింది. హిందూ ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు అన్యాయమని, వెంటనే ఆయన్ను విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హిందువులపై కొనసాగుతున్న దాడులను కట్టడి చేయాలని, భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టేలా చర్యలు తీసుకోవాలని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబాలే ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
'ఆ దాడులు వ్యవస్థీకృతమైనవి కాదు'
తమ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు వ్యవస్థీకృతమైనవి కాదని, చెదురుమదురు ఘటనలు మాత్రమేనని ఐక్యరాజ్యసమితికి చెందిన మైనారిటీల వ్యవహారాల విభాగానికి బంగ్లాదేశ్ తెలిపింది. హిందూ ఆధ్యాత్మిక నేత చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును వక్రీకరిస్తున్నారని, అతనిపై నిర్దిష్టమైన అభియోగాలు నమోదయ్యాయని ఐరాసలో ఢాకా రాయబారి, శాశ్వత ప్రతినిధి తారిక్ మహ్మద్ అరిఫుల్ ఇస్లాం వివరించారు. చట్టబద్ధంగానే కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. జెనీవాలో నవంబరు 28, 29 తేదీల్లో నిర్వహించిన ఐరాస మైనారిటీ వ్యవహారాల విభాగ 17వ సెషన్‌లో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. అంతకుముందు బంగ్లాదేశ్‌కు చెందిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ సెక్యులర్ బంగ్లాదేశ్(ఐఎఫ్‌ఎస్‌బీ) ప్రతినిధులు ఆ దేశంలోని ఉద్రిక్త పరిస్థితులను సమావేశంలో వివరించారు.