Om Prakash Chautala Passed Away :ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా (89) శుక్రవారం కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయనకు గుండె పోటురాగా, ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయనను వైద్యులు రక్షించలేకపోయారని పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.
మాజీ ఉపప్రధాని దేవీలాల్ కుమారుడైన ఓం ప్రకాశ్ చౌతాలా హరియాణాకు ఐదు సార్లు (1989 నుంచి 2005 వరకు) ముఖ్యమంత్రిగా పనిచేశారు.
మోదీ సంతాపం
హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
"చౌతాలా చాలా ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పని చేశారు. తన తండ్రి దేవీ లాల్ పనులను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేశారు" అని ఎక్స్ వేదికగా మోదీ ట్వీట్ చేశారు.
ఆయన లోటు తీర్చలేనిది!
ఓం ప్రకాశ్ చౌతాలా మృతిపై హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ట్వీట్ చేశారు. 'చౌతాలా మరణం చాలా బాధాకరం. ఆయనకు నా నివాళులు. ఆయన తన జీవింతాంతం రాష్ట్రానికి, సమాజానికి సేవ చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు' అన్నారు.
నాకు అన్నలాంటివారు!
ఓం ప్రకాశ్ చౌతాలా మృతి పట్ల హరియాణా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
"ఓం ప్రకాశ్ చౌతాలా సీఎంగా ఉన్నప్పుడు నేను లోక్‌సభ సభ్యునిగా ఉన్నాను. మా మధ్య మంచి స్నేహ సంబంధం ఉండేది. చౌతాలా ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవారు. ఆయన ఇంత తొందరగా మనల్ని విడిచి వెళ్లిపోతారని నేను ఊహించలేదు. ఆయన చాలా మంచి వ్యక్తి, నాకు పెద్దన్నయ్య లాంటివారు" అని అన్నారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలి!
'ఓం ప్రకాశ్ చౌతాలా మరణవార్త చాలా బాధాకరం. ఆయన హరియాణాకు, దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను' అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు.
ఓం ప్రకాశ్ చౌతాలా ప్రస్థానం
- హరియాణాలో చౌతాలా కుటుంబం చాలా పేరున్న రాజకీయ కుటుంబం.
- మాజీ ప్రధాని చౌదరీ దేవీలాల్ ఐదుగురు సంతానంలో ఓం ప్రకాశ్ చౌతాలా పెద్దవారు.
- ఓం ప్రకాశ్ చౌతాలా 1935 జనవరి 1న జన్మించారు.
- ఓం ప్రకాశ్ చౌతాలకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య స్నేహ లత ఐదేళ్ల క్రితమే చనిపోయారు.
- ప్రాథమిక విద్య తరువాత చౌతాలా చదువు మానేశారు. టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం సమయంలో ఆయన తిహాఢ్ జైలుకు వెళ్లారు. అప్పుడే 82 ఏళ్ల వయస్సులో ఆయన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.
- 2021లో జైలు నుంచి విడుదలైన ఆయన మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు.
- చౌతాలా పెద్ద కుమారుడైన అజయ్ సింగ్ చౌతాలా కూడా టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో నేరస్థుడిగా తిహాఢ్ జైలుకు వెళ్లారు. తరువాత ఆయన ఎంపీ కూడా అయ్యారు. తరువాత తమ పార్టీతో విభేదించి 2018 డిసెంబర్‌లో జననాయక్ జనతా పార్టీని స్థాపించారు. ఈయన కుమారులు దుష్యంత్, దిగ్విజయ్ జేజేపీ పార్టీ నేతలుగా కొనసాగుతున్నారు. వీరిలో దుష్యంత్ చౌతాలా హరియాణా ఉపముఖ్యమంత్రిగా పని చేశారు.
- చౌతాలా చిన్న కుమారుడు అభయ్ సింగ్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈయన కుమారుడు అర్జున్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
- చౌతాలాకు చెందిన ఐఎన్‌ఎల్‌డీ పార్టీ గతంలో బీజేపీతో కలిసి పనిచేసింది. 2005 నుంచి ఆ పార్టీ - అధికారానికి దూరంగానే ఉంది.