తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫేల్‌-M యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ రెడీ- అమెరికా నుంచి భారీస్థాయిలో హెలికాప్టర్‌ పరికరాలు - RAFALE JETS INDIA

రఫేల్‌ మెరైన్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధం- వచ్చే నెలలో ఒప్పందం!- భారత్‌- అమెరికా వ్యూహాత్మక బంధంలో మరో కీలక పరిణామం

India Deals Aircrafts
India Deals Aircrafts (ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2024, 8:34 AM IST

Updated : Dec 3, 2024, 10:14 AM IST

India Deals Aircrafts : రఫేల్‌-M యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య త్వరలోనే ఒప్పందం కుదరనుంది. నౌకాదళం కోసం అదనంగా మూడు స్కార్పియన్‌ శ్రేణి జలాంతర్గాములు, 26 రఫేల్‌ ఎం విమానాలను భారత్‌ కొనుగోలు చేయనుంది. మరోవైపు, భారత్‌కు భారీస్థాయిలో హెలికాప్టర్‌ విడిభాగాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈమేరకు పెంటగాన్‌ ఓ కీలక ప్రకటన చేసింది.

వచ్చే నెలలో ఒప్పందం
ఫేల్‌-M యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాలపై వచ్చే నెలలో సంతకాలు జరగవచ్చని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కె త్రిపాఠి తెలిపారు. ఇప్పటికే ఈ ఒప్పందం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ కొన్ని నెలల క్రితం ఫ్రాన్స్‌ను సందర్శించి మంతనాలు జరిపారు.
విమాన వాహక నౌక INS విక్రాంత్‌ సహా వివిధ స్థావరాల్లో రఫేల్‌-ఎం యుద్ధ విమానాలను మోహరించాలని భారత నౌకాదళం భావిస్తోంది. వీటిరాకతో భారత తీర ప్రాంత రక్షణ, శత్రువుపై దాడి చేసే సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి. సెప్టెంబర్‌లోనే రఫేల్‌-ఎం యుద్ధ విమానాలకు సంబంధించిన తుది ధరలను భారత్‌కు ఫ్రాన్స్‌ ఇచ్చింది. 22 సింగిల్‌ సీటర్‌ రఫేల్‌ మెరైన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, మరో నాలుగు ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయాలని భారత్‌ భావిస్తోంది. వీటితో పాటు పెద్ద సంఖ్యలో దీర్ఘశ్రేణి ఎయిర్‌ టు ఎయిర్‌ మిస్సైల్స్‌ను, యాంటీ షిప్‌ ఆయుధాలను ఈ ప్రాజెక్టులో భాగంగా భారత్‌ సమకూర్చుకోనుంది.

రూ.9వేల కోట్లకుపైగా విలువైన విడిభాగాలు విక్రయం
భారత్​కు 1.17 బిలియన్‌ డాలర్ల (రూ.9.9 వేల కోట్లు) విలువైన హెలికాప్టర్‌ విడిభాగాల విక్రయానికి అగ్రరాజ్యం ఆమోదించింది. ఈ విడిభాగాలు ఎంహెచ్‌-60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్‌ల బలోపేతానికి విక్రయించనున్నట్లు పెంటగాన్‌ తెలిపింది. లాక్‌హీడ్‌ మార్టిన్‌ అనే కంపెనీ ఈ ఒప్పందంలో కీలకపాత్ర పోషించినట్లు వెల్లడించింది.

ఏంటీ ఎంహెచ్‌-60ఆర్‌ సీహాక్?
సముద్రజలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, రాడార్లను నాశనం చేసేందుకు ఈ ఎంహెచ్‌-60 సీహాక్‌ హెలికాప్టర్‌లు వినియోగిస్తారు. ఇందులోని 38 లేజర్‌- గైడెడ్‌ రాకెట్‌లు, నాలుగు ఎంకే54 టోర్పిడోలు, మెషీన్‌గన్‌లు శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి. హెలికాప్టర్‌ ముందుభాగంలోని ఫార్వర్డ్‌- లుకింగ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లు ఎదురుగా ఉన్న జలాంతర్గామి లేదా క్షిపణికి సంబంధించిన కచ్చితమైన చిత్రాన్ని ఆవిష్కరించగలవు. ఈ లోహవిహంగం ఒక ప్రాంతాన్ని స్కాన్‌ చేయగలదు. క్షిపణి దాడులపై హెచ్చరికలను సైతం చేస్తోంది.

మరోవైపు డిసెంబర్‌ 4వ తేదీన ఒడిశాలోని పూరిలో జరగనున్న నౌకాదళ దినోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నారు. ప్రస్తుతం నౌకా దళానికి చెందిన 63 యుద్ధ నౌకలు, ఓ జలాంతర్గామి నిర్మాణదశలో ఉన్నాయని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కె త్రిపాఠి తెలిపారు. దేశీయంగా డిజైన్‌ చేసిన అణుశక్తితో పనిచేసే రెండు అటాక్‌ సబ్‌మెరైన్ల ప్రాజెక్టు కూడా దేశీయంగా నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి దారితీస్తుందన్నారు. ఈ SSN జలాంతర్గాములలో మొదటిదాని సేవలు 2036-37 నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. ఆ తర్వాత మరో రెండేళ్లకు మిగిలినది కూడా సిద్ధమవుతుందని చెప్పారు. 1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో నౌకదళ వీరత్వానికి చిహ్నంగా డిసెంబర్‌ 4న నేవీ డే వేడుకలు నిర్వహిస్తారు. ఈసారి ఒడిశాలోని పూరి తీరంలో నౌకాదళం తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనుంది.

Last Updated : Dec 3, 2024, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details