INDIA Alliance Seat Sharing :సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమి కసరత్తులు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా కూటమిలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చిన కాంగ్రెస్, అదే జోరుతో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)తో మళ్లీ చర్చలకు సిద్ధమైంది. ఇదివరకే ఇరుపార్టీల మధ్య చర్చలు నిలిచిపోయాయి.
టీఎంసీ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌కు 2 స్థానాలకు మించి ఇవ్వలేమని తెలిపారు. అందుకు కాంగ్రెస్ అంగీకరించకపోవటం వల్ల అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మమతను ఒప్పించేందుకు కాంగ్రెస్ కొత్త ఫార్ములా సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా 5 సీట్లు ఇవ్వాలని కోరుతోంది.
ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్న కొన్ని సీట్లను కాంగ్రెస్‌కు ఇవ్వాలని టీఎంసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బెహ్రాంపూర్, మాల్దాసౌత్, మాల్దా నార్త్, రాయ్‌గంజ్, డార్జిలింగ్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందుకు దీదీ సుముఖత తెలిపే అవకాశం ఉన‌్నట్లు తెలుస్తోంది. పురూలియా సీటు కూడా కాంగ్రెస్ కోరుతున్నా, మమత అంగీకరించకపోవచ్చని సమాచారం.