IMA Nationwide Protest :కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) సిద్ధమైంది. బుధవారం రాత్రి కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి వ్యతిరేకంగా, శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఓపీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. కాగా, అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సేవలు యథావిధిగా పనిచేస్తాయని వెల్లడించింది. రాష్ట్ర శాఖలతో సమావేశం అనంతరం ఐఎమ్ఏ ఈ నిర్ణయం తీసుకుంది.
"కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా(బుధవారం రాత్రి) విద్యార్థులు నిరసన చేపట్టారు. వారు నిరసన తెలిపిన ప్రాంగణంపై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ హేయమైన చర్యకు వ్యతిరేకంగా శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి ఆదివారం(ఆగస్టు 18) ఉదయం 6 గంటల వరకు మోడర్న్ మెడిసిన్ డాక్టర్ల సేవలు ఉపసంహరించుకుంటున్నాం. వైద్య వృత్తి స్వభావం కారణంగా వైద్యులు ముఖ్యంగా మహిళలు హింసకు గురవుతున్నారు. అలాంటి డాక్టర్లకు ఆస్పత్రులు, క్యాంపస్‌ల్లో భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల అవసరాలను పర్యవేక్షించే అధికారుల ఉదాసీనత వల్లే వైద్యులపై భౌతిక దాడులు, నేరాలు జరుగుతున్నాయి." అని ఐఎమ్ఏ ఓ ప్రకటనలో వివరించింది.