తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జగన్ సర్కార్‌ను విమర్శిస్తే చాలు - అక్రమ కేసులతో హింస పెట్టడమే నైజం! - ఏపీలో అక్రమ కేసులు నమోదు

Illegal Cases Against Opposition Parties in AP: ఏదైనా నేరం చేస్తే కేసు పెడతారు. అరెస్టు చేసి జైల్లో వేస్తారు. కానీ ఏపీలోని జగనన్న జమానాలో పెద్ద నేరాలు, ఘోరాలేమీ చేయాల్సిన పని లేదు. హక్కుల కోసం గళమత్తితే చాలు ప్రజాస్వామిక పద్దతిలో ప్రభుత్వానికి నిరసన తెలిపితే చాలు ఎఫ్​ఐఆర్​లు పుట్టుకొస్తాయ్! కేసులు మీద పడతాయ్‌. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు! ప్రభుత్వాధినేతను విమర్శిస్తే కేసు! ప్లకార్డు ప్రదర్శిస్తే కేసు! సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే కేసు ఆ పోస్టు ఫార్వర్డ్ చేస్తే కేసు! ఇలా ప్రభుత్వ వ్యతిరేకతను పాలకులు కేసులతోనే కట్టడి చేస్తున్నారు. పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగలేక కుమిలిపోతున్నవారు కొందరైతే స్టేషన్లలో కమిలిపోతున్నావారు మరికొందరు! అక్రమ ఎఫ్​ఐఆర్లే ఆయుధంగా వైఎస్సార్సీపీ సర్కార్‌ పౌరులపైకి పోలీసుల్ని ఉసిగొల్పుతోంది. హక్కుల్ని కాలరాస్తోంది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 1:52 PM IST

జగన్ సర్కార్‌ను విమర్శిస్తే చాలు - కేసులతో హింస పెడతారంతే!

Illegal Cases Against Opposition Parties in AP :ఏపీలో భావ ప్రకటనా స్వేచ్ఛకు పట్టిన దుర్గతి అంతా ఇంతా కాదు. అనంతపురం జిల్లాకు చెందిన దళిత ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ పోలీసులకు రావాల్సిన బకాయిలు ఇప్పించండి సీఎం సార్ అంటూ ఫ్లకార్డు ప్రదర్శించారు. ఇక అంతే ఆయనపై వేధింపులు, ఆ తర్వాత అక్రమ కేసులు, చివరగా ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేసేసి ఇంటికి పంపారు. జగన్‌తో పెట్టుకుంటే ఎవరికైనా అదేగతి. దీనికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏఆర్ సూర్యనారాయణ కూడా మినహాయింపు కాదు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పట్టుబట్టడమే సూర్యనారాయణ పాలిట శాపమైంది. ఆ తర్వాత వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించారంటూ ఓ ఎఫ్​ఐఆర్​ తెరపైకి వచ్చింది.

ఇప్పుడు ఆయన ఉద్యోగుల సమస్యలు దేవుడెరుగు అంటూ దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ తిరుగుతున్నారు. వీళ్లిద్దరివీ కాస్త గట్టిగుండెలు కాబట్టి తట్టుకున్నారు. అక్రమ కేసుల్ని ఎదుర్కోలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని బలుసుపేటకు చెందిన దళిత యువకుడు ఎ.గిరీష్‌బాబు జీవితం అలా బలైందే. వైఎస్సార్సీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. కసితీరా కొట్టారు. మనస్థాపంతో గిరీష్‌ తనువుచాలించాడు. ఇక నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరూ సరిదిద్దలేనిది. తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ వీడియోలో చెప్పుకున్న సలాం నలుగురు కుటుంబ సభ్యులతోకలిసి రైలుపట్టాలపై ప్రాణాలు తీసుకున్నారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటనపై రంగనాయకమ్మ స్పందన : తమ బాధను చెప్పుకోవడమే కాదు. వేరొకరి బాధను పంచుకున్నా రాష్ట్రంలో నేరమే అనేలా పరిస్థితి మారిపోయింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టును షేర్‌ చేసినందుకు రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై కేసు పెట్టి సీఐడీ కార్యాలయం చుట్టూ తిప్పారు. ఆమె హోటల్‌ వ్యాపారాన్ని దెబ్బతీశారు. తమ జీవితాన్ని సర్వనాశనం చేశారని రంగనాయకమ్మ ఇటీవల కుమిలిపోయారు. వాట్సప్‌లో తనకు వచ్చిన పోస్టును వేరే గ్రూపులో ఫార్వర్డ్‌ చేశారంటూ గుంటూరుకే చెందిన 73 ఏళ్ల సీనియర్‌ జర్నలిస్టు అంకబాబునూ కేసు పెట్టి వేధించారు. అంకబాబుపై సీఐడీ సెక్షన్లు చెల్లుబాటుకావని హైకోర్టు చివాట్లు పెట్టి ఎఫ్ఐఆర్​ను కొట్టేయడంతో ఆయన బతికిపోయారు.

"ఘర్షణ" యూట్యూబర్‌ అరెస్టు : ఇక ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపుతున్న "ఘర్షణ" యూట్యూబర్‌ వెంగళరావును సీఐడీ అధికారులు వెంటాడిమరీ అరెస్టు చేశారు. హైదరాబాద్‌ వెళ్తుండగా కోదాడ వద్ద బస్సులో నుంచి దింపి తీసుకెళ్లారు. సీఐడీ కార్యాలయం నుంచి వెంగళరావు ఇలా కుంటుతూ బయటకు రావడం పోలీస్‌ పైశాచికానికి పరాకాష్ట.

కోర్టుల చుట్టూ యశస్విని : అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వ విధానాల్ని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించారని తెనాలికి చెందిన బొద్దులూరి యశస్విని సీఐడీ వెంటాడింది. ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేసి విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకుంది. ఇప్పటికి అతనిపై మూడు కేసులు నమోదు చేసి విచారణ పేరిట కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిప్పుతోంది.

గుంటూరు జిల్లా ధరణికోటకు చెందిన యూట్యూబర్‌, తెలుగుదేశం మద్దతుదారు గార్లపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో సీఐడీ పోలీసుల రుబాబు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ ఇలా అర్థరాత్రి సీఐడీ పోలీసులు గోడలు దూకారు. కుటుంబ సభ్యుల్ని బెదరగొట్టి వెంకటేశ్వరరావును తీసుకెళ్లారు. ఇలా తెలుగుదేశం నేతలు, సానుభూతిపరులపై కేసులకు జగన్‌ ఏలుబడిలో లెక్కేలేదు. అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాల్ని ప్రభుత్వం రద్దు చేసిందంటూ నకిలీ ప్రకటనను సామాజికమాధ్యమాల్లో వ్యాప్తి చేశారని టీడీపీ నాయకురాలు గౌతు శిరీషను మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు.

అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే పద్మావతిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకూ నోటీసులిచ్చారు. వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టులను ఫార్వర్డ్‌ చేసిన ఆరోపణల కేసులో టీడీపీ మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రబాబును అరెస్టు చేశారు. టీడీపీ మైనారిటీ నేత అన్వర్‌బాషాను బక్రీద్‌ పండగ వేళ అర్ధరాత్రి సమయంలో పోలీసులు అమానుషంగా అరెస్టు చేశారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య కారంపూడిలో చోటుచేసుకున్న గొడవకు సంబంధించి అన్వర్‌ను తీసుకెళ్లారు.

చంద్రబాబు అరెస్టు తర్వాత బాబుతోనే మేము సైతం అని బాపట్ల జిల్లా వాడరేవు సముద్రతీరంలో వేసిన సైకత శిల్పం. ఇదోతప్పన్నట్లు టీడీపీ నేతలు చింతకాయల విజయ్ సహా పలువురిపై పోలీసులు కేసులు పెట్టారు. అందులో తప్పేముందన్నట్లు హైకోర్టు కూడా ఆ ఎఫ్​ఐఆర్​ను కొట్టేసింది.

ఇక చిత్తూరు జిల్లాలో చంద్రబాబు, లోకేశ్‌ను కలిసిన వారిపై కేసులు పెట్టడమే ఓ వింతైతే దానికి చూపిన కారణాలు మరో వింత. యువగళం పాదయాత్రలో లోకేశ్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్నందుకు తిరుపతి జిల్లా తొట్టంబేడు ఠాణాలో రజక మహిళ మునిరాజమ్మ, ఆమె భర్త మారగంటి వెంకటాద్రిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. వాళ్లు హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్లిన తెదేపా నాయకురాళ్లపై ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. పోలీసుల్ని జెండా కర్రతో పొడిచారట, ప్రతిఘటించే క్రమంలో సీఐ చేతి వేలికి గాయమైందట. అదీ ఎఫ్​ఐఆర్ సారాంశం.

తెలుగుదేశం నేతలపైనే కాదు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాల్ని ఎవరు ప్రశ్నించినా ఎక్కడో ఒక చోట ఎఫ్​ఐఆర్ నమోదు చేయడం పరిపాటైంది. అధికార పార్టీలో అవినీతిపై గళమెత్తిన ఒంగోలు వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై ఎమ్మెల్యే బాలినేని అనుచరులు దాడి చేశారు. కానీ రివర్స్‌లో గుప్తాపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. గంజాయి కేసులోనూ ఆయన్ను ఇరికించి అరెస్టు చేశారు.

మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తిరుపతి జనసేన నేత కిరణ్‌ రాయల్‌నూ అరెస్టు చేశారు. సెల్‌ ఫోన్‌లూ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కిరణ్‌ రాయల్‌ హైకోర్టు తలుపుతట్టారు! ఇక ఎస్సీలపైనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేంత దీన స్థితికి దిగజారారు ఏపీ పోలీసులు.

మూడు రాజధానులకు అనుకూలంగా తాళ్లాయపాలెం జరిగే కార్యక్రమానికి వెళుతున్న వారిని కులం పేరుతో దూషించి దాడి చేశారంటూ అమరావతి ప్రాంత రైతుల్ని పోలీసులు అరెస్టు చేశారు. చేతులకు బేడీలు వేయడం అప్పట్లో దుమారమే రేపింది. ఇలా వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించం, విపక్షాలకు సానుభూతి తెలపడం పెద్ద తప్పు అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి తయారైంది. స్నేహపూర్వకంగా మెలగాల్సిన ప్రభుత్వమే ఏపీలో పౌరుల ప్రశాంత జీవితాన్ని నరకం చేస్తోంది. కేసులు నమోదు చేయడం, ప్రాథమిక ఆధారాలతో పనిలేకుండానే అరెస్టులు చేయడం,అక్రమఅరెస్టులంటూ కోర్టుల చేతిలో మొట్టికాయలు తినడం పోలీసులకు పరిపాటైంది. ఐనా వేధింపులు ఆపడం లేదు. బెయిలు దొరికిన తర్వాత కూడా బాధితులను వదలకుండా విచారణ పేరిట తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details