Maharashtra Next CM: మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విషయంలో బీజేపీ నిర్ణయానికి పూర్తి మద్దతిస్తామని, అందుకు తాను అడ్డంకి కాదని పేర్కొన్నారు. ఠాణేలోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుధవారం శిందే మాట్లాడారు. మహాయుతి కూటమికి విజయాన్ని అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మహా సీఎంగా దేవేంద్ర ఫడణవీస్కే అవకాశం దక్కుతుందనే వార్తలు జోరుగా ప్రచారం జరగుతున్న నేపథ్యంలో శిందే ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా, సీఎం నుంచి రేసు నుంచి తప్పుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
'మహాయుతి కార్యకర్తలందరూ కష్టపడి పనిచేశారు. కూటమికి మహారాష్ట్ర ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. ఎన్నికల సమయంలో తెల్లవార్లు పనిచేశాను. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయాను. ఒక కార్యకర్తలా చెప్పులరిగేలా తిరిగాను. నా దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. కష్టాలన్నీ తెలుసు. మహిళలు, రైతులు ఇలా అన్నీ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు తీసుకొచ్చాం. మా సంక్షేమ పథకాలు చూసిన తర్వాతే ప్రజలు మళ్లీ పట్టం కట్టారు. సీఎంగా రెండున్నరేళ్లుగా చేసిన పని సంతృప్తినిచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ, అమిత్‌షా అండగా నిలిచారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడాను. సీఎం ఎంపిక విషయంలో వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.' అని ఏక్‌నాథ్ శిందే తెలిపారు.