How To Make Vamu Charu :వర్షాకాలంలో అప్పుడప్పుడూ కురిసే తేలికపాటి జల్లులు, భారీ వర్షాల వల్ల చాలా మందిని జలుబు, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యలు మరీ పెద్దవి కాకపోయినా కూడా రోజంతా మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇలాంటి సమయంలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వాముతో చారు చేసుకుని వేడి వేడి అన్నంలోకి పోసుకుని తినడం వల్ల పై సమస్యలకి చెక్ పెట్టొచ్చు. అలాగే గ్లాసులో పోసుకుని ఈ వాము చారుని తాగేయొచ్చు. ఇన్ని ప్రయోజనాలన్న వాము చారుని సింపుల్‌గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
వాము తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :
వాము చారు పౌడర్ కోసం
- వాము - ఒక టీస్పూన్
- ఎండు మిర్చి - 2
- జీలకర్ర - అర టీస్పూన్
- ధనియాలు - టీ స్పూన్
వాము చారు కోసం
- నూనె - టీస్పూన్
- ఎండుమిర్చి - 1
- రాళ్ల ఉప్పు - సరిపడా
- పసుపు - చిటికెడు
- మెంతులు - పావు టీ స్పూన్
- పచ్చిమిర్చి-1
- ఆవాలు - అర టీ స్పూన్
- కరివేపాకు- 2 రెమ్మలు
- వెల్లుల్లి రెబ్బలు -5
- చింతపండు - నిమ్మకాయంత
అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్‌లా తాగేయొచ్చు!
తయారీ విధానం:
- ముందుగా మిక్సీ జార్‌లో వాము, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకుని మెత్తని పౌడర్‌లాగా చేసుకోవాలి.
- ఇప్పుడు నిమ్మకాయంత చింతపండును నానబెట్టి గుజ్జులా చేసుకుని అందులోకి పావు లీటర్ వాటర్ పోసుకుని పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి.. మెంతులు, ఆవాలు వేసి వేయించండి. తర్వాత జీలకర్ర, కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి, ఎండు మిర్చి వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుని, చింతపండు రసం పోసుకోవాలి.
- ఇప్పుడు చారులో చిటికెడు పసుపు, రుచికి సరిపడ రాళ్ల ఉప్పు, కరివేపాకులు వేసుకోవాలి.
- అలాగే చారులో మరో పావు లీటర్ నీరు పోసుకుని గ్రైండ్ చేసుకున్న వాము పౌడర్ కలపాలి. ఈ చారును 10 నిమిషాల సేపు సన్నని మంట మీద మరిగిస్తే.. ఘుమఘుమలాడిపోతుంది.
- అంతే ఇలా సింపుల్‌గా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాము చారుని తయారు చేసుకోవచ్చు.
వాము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
- వాములో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. విరేచనాలతో బాధపడుతున్నవారు వాము వాటర్ తాగితే ఉపశమనం లభిస్తుంది.
- వాము జీర్ణశక్తిని మెరుగుపరిచి ఆకలిని పెరిగేలా చేస్తుంది. అలాగే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
- వాము పొడితో దంతాలను క్లీన్ చేసుకుంటే చిగుళ్లు బలంగా మారతాయి.
- జలుబుతో బాధపడేవారు వామును ఓ వస్త్రంలో కట్టి వాసన పీలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
- రైస్‌లో వాము పొడిని వేసుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయట.
- వాము పొడిని మజ్జిగలో కలిపి తాగితే అతిసారం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
- వాము మూత్ర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే పుల్లటి తేన్పులను రాకుండా అడ్డుకుంటుంది.
- కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో వాము, నెయ్యి కలిపి తింటే సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
చిటికెలో ఘుమఘుమలాడే "వెల్లుల్లి చారు" - సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ నెక్స్ట్ లెవల్ అంతే!
5 నిమిషాల్లో అద్దిరిపోయే మిరియాల చారు - సీజనల్ జ్వరాలకు సూపర్ రెమిడీ!