How to Make Hotel Style Crispy Dosa At Home:సౌత్ ఇండియన్స్.. ఫేవరెట్ టిఫెన్స్ అంటే దోశ ముందు ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. దోశలో రకాలు చూస్తే అబ్బో చాలానే ఉంటాయి. ప్లెయిన్ దోశ, మసాలా దోశ, కారం దోశ, ఎగ్ దోశ.. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వేటికవే స్పెషల్ టేస్ట్‌తో ఊరిస్తాయి. అయితే దోశలను ఇంట్లో చేసుకుంటే.. హోటళ్లో చేసేంత క్రిస్పీగా రావు. కాబట్టి క్రిస్పీగా రావాలంటే పిండి దగ్గర నుంచి దోశ వేసే వరకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఒక్కసారి పిండి పర్ఫెక్ట్గా ఉందా.. ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు. అందుకు దోశపిండిని ఎలా తయారు చేసుకోవాలి..? మినప పప్పు, బియ్యం పిండి ఎంత నిష్పత్తిలో ఉండాలి? తదితర విషయాలు తెలుసుకుందాం..
దోశ పిండి తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు:
- మినప గుండ్లు - ఒక కప్పు(125 గ్రాములు)
- బియ్యం - 4 కప్పులు(అర కేజీ)
- మెంతులు - ఒక టేబుల్ స్పూన్
- పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
- అన్నం- అర కప్పు
పిండి తయారు చేసుకునే విధానం
- ముందుగా ఓ గిన్నెలో బియ్యం, పచ్చి శనగపప్పు శుభ్రంగా కడిగి సుమారు 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ సన్న బియ్యం బదులు రేషన్ బియ్యం వాడుకుంటే దోశల టేస్ట్ బాగుంటుంది.
- మరోగిన్నె తీసుకుని మినపప్పు, మెంతులు వేసి వాటిని శుభ్రంగా కడిని 6 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం, మినపప్పు ఎంత నానితే అంత బాగుంటాయి దోశలు.
- బియ్యం, మినప్పప్పు నానిన తర్వాత అందులోని నీరు ఒంపి రెండింటిని కలిపి ఒకే గిన్నెలో కలుపుకుని ప్రెష్ వాటర్ పోసుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా బియ్యం మిశ్రమాన్ని తీసుకుంటూ నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. పిండిని మరీ జోరుగా పట్టుకోవద్దు. కొంచెం గట్టిగానే పిండి పట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా బియ్యం, మినపప్పు మిశ్రమాన్ని మొత్తం కలిపి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే మిక్సీ జార్లో అన్నం తీసుకుని కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని దోశ పిండిలో కలుపుకోవాలి.
- ఇప్పుడు పిండినంతా ఒకసారి బాగా కలుపుకుని పక్కకు పెట్టాలి.
- ఉదయం టిఫెన్లోకి పిండి కావాలనుకున్నవారు రాత్రి సిద్ధం చేసుకుంటే మంచిది. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకునే దోశలు కన్నా.. పిండి కాస్త పులిసిన తర్వాత చేసుకునే దోశలు టేస్టీగా ఉంటాయి. కాబట్టి రాత్రంతా పిండి నానితే ఉదయానికి పిండి పులుస్తుంది.