తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ ఆ విషయంపై ఆందోళన తెలిపి ఉండాల్సింది : అమెరికా పర్యటనపై శశి థరూర్‌ - PM MODI TRUMP MEETING

ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై శశి థరూర్‌ కీలక వ్యాఖ్యలు

PM Modi Trump Meeting
Shashi Tharoor About PM Modi Trump Meeting (ANI)

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2025, 6:40 AM IST

Shashi Tharoor About PM Modi Trump Meeting :ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్యం, సుంకాల విషయంలో చర్చల జరపాలని ఇరుదేశాలు నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని వ్యాఖ్యానించారు.అయితే వలసదారులను వెనక్కి పంపే సమయంలో అమెరికా వ్యవహరించిన తీరుపై భారత ఆందోళనను ట్రంప్‌నకు మోదీ తెలియజేసి ఉంటే బాగుండేదంటూ అభిప్రాయపడ్డారు.

"ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెస్‌మీట్‌ ఆశాజనకంగా ఉంది. ఆందోళనకరమైన అంశాలన్నింటి గురించి వారు మాట్లాడారు. ఉదాహరణకు వాణిజ్యం, సుంకాలు విషయంలో చర్చలు జరపాలని నిర్ణయించారు. సెప్టెంబరు, అక్టోబరు నాటికి చర్చలు పూర్తి కావచ్చు. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే చర్చించుకోవడానికి సమయం దొరికింది. లేకుంటే అధిక సుంకాల వల్ల భారత్ ఎగుమతులపై ప్రభావం పడేది." అని శశి థరూర్‌ అన్నారు.

అక్రమ వలసల విషయంలో ప్రధాని మోదీ వైఖరి సరైనదని శశిథరూర్‌ పేర్కొన్నారు. అమెరికాలో భారత్‌కు చెందిన వారు అక్రమంగా ఉంటే వారిని తిరిగి వెనక్కి పంపించాల్సిందేనని అన్నారు. ఐదో తరం యుద్ధ విమానం అయిన ఎఫ్‌-35ను భారత్‌కు విక్రయించాలని అమెరికా నిర్ణయించడం గొప్ప పరిణామమని శశిథరూర్ అన్నారు.

ఇప్పటికే ఉన్న రఫేల్ యుద్ధవిమానాలకు ఎఫ్‌-35 తోడైతే వాయుసేన మరింత బలంగా మారుతుందని అన్నారు. చైనా, పాకిస్థాన్‌ నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ ఎఫ్‌-35లను ఇస్తామని భారత్‌కు అమెరికా ఆఫర్ ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని నిపుణులు అంటున్నారు. ప్రధాని మోదీనే తన కంటే మెరుగ్గా బేరసారాలు ఆడగలరని ట్రంప్ అనడం ఆశ్చర్యానికి గురి చేసిందని శశిథరూర్ అన్నారు. ట్రంప్‌ సాధారణంగా ఎవరిని పొగడరని చెప్పారు. స్థాయి సంఘం సమావేశాల్లో విదేశాంగశాఖ నుంచి మరిన్ని వివరాలను కోరతామని వెల్లడించారు.

అక్రమ వలసల విషయంలో మోదీ ఒక విషయాన్ని విస్మరించారు. వలసదారులను అమర్యాదగా వెనక్కి పంపడంపై ఆందోళనను తెలియజేసి ఉంటే బాగుండేది. అక్రమవలసల విషయంలో ఆయన వైఖరి సరైనదే. యువతను మోసగించి కొందరు అక్రమంగా దేశం దాటిస్తున్నారు. భారత్‌కు చెందిన అక్రమ వలసదారులు అమెరికాలో ఉంటే వారిని కచ్చితంగా తిరిగి వెనక్కి తీసుకోవాల్సిందే.

అయితే ప్రైవేట్‌గా జరిగిన చర్చల్లో అక్రమ వలసదారులకు చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్లు వేయడంపై మోదీ ఆందోళన తెలిపి ఉండాల్సింది. రక్షణ రంగం విషయానికొస్తే ఎఫ్‌-35 యుద్ధవిమానాలను విక్రయించాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ఎందుకుంటే అవి అత్యాధునిక యుద్ధ విమానాలు. ఇప్పటికే మన దగ్గర రఫేల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. ఎఫ్‌-35 చేరికతో వాయుసేన బలం మరింత పెరుగుతుంది.

-శశిథరూర్‌, కాంగ్రెస్ ఎంపీ


మరోవైపు చైనా, పాకిస్థాన్‌ నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ ఎఫ్‌-35 యుద్ధ విమానాలను విక్రయిస్తామని అమెరికా ప్రకటించడం భారత్‌కు మరింత శక్తిని ఇస్తుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.

భారత్‌ క్వాడ్‌లో సభ్య దేశం. ఎఫ్‌-35 యుద్ధవిమానాలను అమెరికా ఇప్పటికే జపాన్‌, ఆస్ట్రేలియా, నాటో సభ్య దేశాలకు సరఫరా చేసింది. అయితే భారత్‌కు మాత్రం ఇవ్వడం లేదు. ఎఫ్‌-16 యుద్ధవిమానాలు ఇస్తామని బైడెన్ హయాంలో భారత్‌కు తొలి ఆఫర్ వచ్చింది. ఎఫ్‌-16లను పాకిస్థాన్‌కు 30 ఏళ్ల క్రితమే అమెరికా సరఫరా చేసింది. అదో పెద్ద విషయం కాదు. చైనా, పాకిస్థాన్‌ నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ ఎఫ్‌-35లను ఇస్తామని ఆఫర్ చేయడాన్ని స్వాగతించాలి.

-జీడీ భక్షి, రిటైర్డ్‌ ఆర్మీ అధికారి

500బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం టార్గెట్ - త్వరలో భారత్​, అమెరికా మధ్య పెద్ద ఒప్పందాలు!

శ్వేత సౌధంలో మోదీ-ట్రంప్ భేటీ - ద్వైపాకిక్షక సంబంధాలపై కీలక చర్చలు

ABOUT THE AUTHOR

...view details