Honey Bees Raised By Dani Family : చాలా మంది కుక్కలు, పిల్లులు వంటి వాటిని ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని తమ బిడ్డల్లా అల్లారుముద్దుగా చూసుకుంటారు. అయితే ఉత్తరాఖండ్‌కు చెందిన హరగోవింద్ దానీ అనే వ్యక్తి మాత్రం తేనెటీగలను ఇష్టంగా పెంచుతున్నారు. తేనెటీగలు కూడా యజమాని, అతడి కుటుంబం పట్ల అంతే ప్రేమను చూపిస్తున్నాయి!. ఈ క్రమంలో తేనేటీగలతో హరగోవింద్‌కు ఏర్పడిన ఫ్రైండ్‌షిప్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
12 ఏళ్లుగా తేనెటీగల పెంపకం
నైనీతాల్ జిల్లా రామ్‌నగర్‌లోని ప్రసిద్ధ హనుమాన్ ధామ్ సమీపంలో హరగోవింద్ కుటుంబం నివసిస్తోంది. 12 ఏళ్ల క్రితం హరగోవింద్ తేనెటీగలను పెంపకాన్ని ప్రారంభించారు. వాటిని సొంత పిల్లలానే చూసుకుంటున్నారు. ఈ తేనెటీగలు కూడా హరగోవింద్ ఫ్యామిలీని సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తాయి!. వారెవర్ని కుట్టవు. అలాగే వారితో సరదాగా ఆడుకుంటాయి!.
సొంత పిల్లలా తేనెటీగల పెంపకం!
"తేనెటీగలను సొంత పిల్లల్లానే ప్రేమిస్తాను. 12 ఏళ్ల క్రితం 4-5 తేనెటీగలు స్వయంగా మా ఇంటి దగ్గరికి వచ్చాయి. అవి రాగానే నా కుమారుడికి ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నాడు. తేనేటీగల కోసం మా ఇంట్లో వంట గదిపైన ఒక పెట్టె పెట్టాను. మొదట్లో 4-5గా ఉన్న తేనెటీగలు ప్రస్తుతం వేల సంఖ్యలో ఉన్నాయి. నేను ఎక్కడిళ్లినా ఇవి నన్ను చిన్నపిల్లల లాగా వెంబడిస్తాయి. నా కుటుంబ సభ్యులు, బంధువులను కుట్టవు. వాటి కోసం ప్రత్యేకంగా పూల మొక్కలు నాటాను. మేము తేనెటీగల నుంచి తేనెను తీయడం లేదు" అని తేనెటీగలను పెంచుతున్న హరగోవింద్ తెలిపారు.
ఇంట్లోనే తేనెటీగలను పెంచుతున్న హరగోవింద్ (ETV Bharat) ఇంటికి కాపలాగా తేనెటీగలు
తేనెటీగలు తరచుగా తమ తోటలో ఉంటాయని, కొన్నిసార్లు బట్టలపై, తలపై వాలుతాయని హరగోవింద్ కుమారుడు ప్రకాశ్ చంద్ర పేర్కొన్నారు. ఈ తేనేటీగలను తమ కుటుంబ సభ్యుల్లానే భావిస్తున్నామని తెలిపారు. "ఒక్కోసారి రాత్రిపూట లైట్లు వేయగానే అవి మా మంచంపైకి వస్తాయి. కానీ ఎటువంటి హాని చేయవు. ఓ రోజు మేం ఇంట్లో లేని సమయంలో తేనెను దొంగిలించేందుకు వచ్చిన వారిని తేనెటీగలు కుట్టాయి. మేము ఇంట్లో లేని సమయంలో ఈ తేనెటీగలు కూడా కుటుంబ సభ్యుల్లానే ఇంటికి కాపలాగా ఉంటున్నాయి" అని ప్రకాశ్ తెలిపారు.
చిన్నారులతో సరదాగా ఆటలు
అలాగే హరిగోవింద్ మనవరాళ్లు యశస్వీ, నందిక కూడా తేనెటీగలతో ఆడుకుంటారు. ఈ చిన్నారుల పరిగెడితే వారిని తేనెటీగలు వెంబడిస్తాయి. అలాగే చిన్నారులపై కొన్నిసార్లు కూర్చుంటాయి. కానీ వారికి ఎటువంటి హాని తలపెట్టవు. తేనెటీగలు హరగోవింద్ కుటుంబానికి మచ్చిక కావడంపై రాంనగర్ కాలేజీ జువాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ మండల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మన చుట్టూ నివసించే జీవులు, జంతువులను సామాజిక జీవులు అని కూడా అంటారని' చెప్పారు. ఈ తేనెటీగలు కూడా సామాజిక కీటకాలని వెల్లడించారు.
'అందుకు వారిని కుట్టడం లేదు'
"ఉత్తరాఖండ్‌లో నాలుగు రకాల తేనెటీగలు ఉన్నాయి. హరగోవింద్ కుటుంబం పెంచినవి తేనెటీగలు మెలిపోనా జాతికి చెందినవి. అవి చిన్న రంధ్రాలు, గుహ ఆకారంలో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తాయి. ఈ తేనెటీగలు సాధారణంగా ఎవరికీ కుట్టవు. మానవ శరీరం కూడా వివిధ రకాల సువాసనను విడుదల చేస్తుంది. వేర్వేరు వ్యక్తులు రకరకాల శరీర వాసనను కలిగి ఉంటారు. హరగోవింద్ ఇంటిలో నివసిస్తున్న ఈ తేనెటీగలు ఆయన కుటుంబంలోని వ్యక్తుల శరీర వాసనను గుర్తించాయి. అందుకే వారిని గుర్తించి కుట్టడం లేదు" డాక్టర్ శంకర్ మండల్ తెలిపారు.