Holi 2024 Date and Time :దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో, కోలాహలంగా జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో హోలీ ఒకటి. కుల, మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కలర్ఫుల్ ఫెస్టివల్ నాడు సంబరాలలో మునిగితేలుతారు. పశ్చిమ బంగాల్, అస్సాం, త్రిపురలలో 'రంగుల పండుగ' అని కూడా పిలుస్తారు. దీనిని 'డోల్ జాత్రా' లేదా 'బసంత ఉత్సవ్' అని కూడా పిలుస్తారు. సాధారణంగా హోలీ ఫిబ్రవరి చివరలో లేదా మార్చి మొదట్లో వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే హోలీ(Holi 2024) శీతాకాలం ముగింపు, వేసవి ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రంగుల పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. వీటన్నింటిని పక్కన పెడితే.. అసలు ఈ ఏడాది హోలీ ఎప్పుడు వచ్చింది? హోలీకా దహన్ ఎప్పుడు జరుపుకోవాలి? హోలీ వెనుక ఉన్న పురాణ కథల వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హోలీ 2024 తేదీ, సమయం : హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్లం పక్షం పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీని మార్చి 25 సోమవారం రోజు జరుపుకోనున్నారు. దాని ముందు రోజు అంటే మార్చి 24వ తేదీ ఆదివారం రోజున హోలీకా దహన్ జరుపుకోనున్నారు. దృక్ పంచాంగ ప్రకారం పౌర్ణమి తిథి మార్చి 24 ఉదయం 9 గంటల 54 నిమిషాలకు ప్రారంభమయ్యి.. మార్చి 25 మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ముగియనుంది.
హోలీ కథలు:హిందూ పురాణాల ప్రకారం.. రాక్షస రాజైన హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి మరణం రాకుండా ఉండేలా వరం పొందుతాడు. తనకి మరణం లేదనే గర్వంతో దేవతల మీద దండెత్తుతాడు. మానవులెవరూ ఏ దేవుళ్లని ఆరాధించేందుకు వీలు లేదని తనను మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపిస్తాడు. కానీ, హిరణ్యకశిపుడు కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం అనునిత్యం విష్ణువు నామాన్ని జపించేవాడు. దీంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు కొడుకుని హతమార్చాలని నిర్ణయించుకుని, తన సోదరి హోలికాను పిలిపించుకుని, ప్రహ్లాదుడికి మంటల్లో కాల్చేయమని ఆదేశిస్తాడు. అప్పుడు ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చొపెట్టుకుని అగ్ని కీలల్లోకి దూకేస్తుంది. అయితే, అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరిని ఆరాధించడం వల్ల ఆ మంటలు అతడిని ఏమి చేయలేకపోతాయి. కానీ, హోలీకా మాత్రం ఆ మంటల్లో దహనం అవుతుంది. అందుకు గుర్తుగా అప్పటి నుంచి 'హోలికా దహన్' నిర్వహిస్తారు.