Health Risks of Synthetic Holi Colours :హోలీ(Holi 2024) పండుగ ఆనందం నింపాలేగానీ.. విషాదం మిగల్చకూడదు. ఇలా జరగొద్దంటే.. సింథటిక్ రంగులను ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రంగుల తయారీలో రాగి, సిలికా, సీసం, ఆర్సెనిక్ వంటి అనేక విషపూరిత రసాయనాలు ఉపయోగిస్తారు. అలాగే.. మైకా, గాజు కణికలు, ఆస్బెస్టాస్ వంటి కొన్ని పదార్థాలను కూడా యూజ్ చేస్తారు. కాబట్టి.. వీటిని వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
హోలీ సింథటిక్ రంగుల కారణంగా.. చర్మం, కన్ను, శ్వాసనాళాలు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా కళ్ల విషయంలో చాలా జాగ్రత్త అవసరమని నేత్ర వైద్యులు డాక్టర్ అరోరా సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఈ కలర్స్ వల్ల నేత్రాలకు ఎక్కువ గాయాలు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కొన్నిసార్లు చూపు కోల్పోయే ప్రమాదమూ ఉందంటున్నారు. 2020లో నిర్వహించిన "Clinical profile of eye injuries due to Holi colours" అనే అధ్యయనం ప్రకారం.. ఈ రంగులు కంటిలోకి పోయిన కారణంగా ముగ్గురు వ్యక్తులు దృష్టి కోల్పోయారని తేలింది.
ఈ జాగ్రత్తలు కంపల్సరీ..
- ఒకవేళ సింథటిక్ రంగులు వాడితే.. తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ అరోరా సూచిస్తున్నారు. ముఖం మీద నేరుగా రంగులు చల్లడం చేయకూడదంటున్నారు. దీనివల్ల కంట్లోకి పోయి ఛాన్స్ ఉంటుంది.
- కళ్లల్లో రంగు పడితే నులమకూడదు. అలా చేస్తే.. కంటి పొరల్లో రాపిడి జరిగి కార్నియా దెబ్బతినే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
- కంటిలో రంగు పడితే వెంటనే చేతులు కడుక్కొని, స్వచ్ఛమైన నీళ్లు తీసుకొని అందులో కళ్లను ముంచి.. సున్నితంగా కదిలించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
- కంట్లోకి నీళ్లు కొట్టడం, చేతి రుమాలు, టిష్యూ ఉపయోగించి కంటిలో చిక్కుకున్న నలుసు తొలగించే ప్రయత్నం కూడా చేయకూడదంటున్నారు. అది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
- కళ్లను శుభ్రపరిచినప్పటికీ సమస్య అలాగే ఉంటే.. వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. వైద్యుల సూచనలు లేకుండా ఐడ్రాప్స్ వంటివి ఏవీ వాడకూడదని చెబుతున్నారు.
హోలీ - హెల్త్‌కు హాని చేయని కలర్స్‌ను సింపుల్‌గా ఇంట్లోనే రెడీ చేసుకోండిలా!
- హోలీ రంగులలో ఉండే రసాయనాలు, భార లోహలకు గురికావడం వల్ల చర్మ అలర్జీలు తలెత్తుతాయంటున్నారు. కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి సింథటిక్ రంగులను ఉపయోగించడం వల్ల.. వివిధ చర్మ అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.
- హోళీ ఆడిన తర్వాత.. చర్మంపై ఎరుపు, దురద, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే తగిన వైద్య సంరక్షణ అవసరమని సూచిస్తున్నారు.
- సింథటిక్ హోలీ రంగుల వల్ల శ్వాస సంబంధిత రోగాలు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- ఆస్తమా, బ్రోన్కైటిస్ లేదా COPD వంటి శ్వాసకోశ పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు ఈ రంగులకు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. సింథటిక్ రసాయనాలకు గురైతే.. గురక, దగ్గు, శ్లేష్మం ఉత్పత్తి పెరగడం వంటి ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
- కాబట్టి.. సాధ్యమైనంత వరకు నేచురల్ రంగులనే వినియోగించాలని సూచిస్తున్నారు.
ఈ ఏడాది హోలీ ఎప్పుడు - మార్చి 24నా? మార్చి 25వ తేదీనా?