Himachal Pradesh Floods: హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదల కారణంగా ముగ్గురు మరణించారు. 40 మంది గల్లంతయ్యారు. శిమ్లా, మండి జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో అనేక ఇళ్లు కొట్టుకుపోగా, రెండు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసం అయ్యాయి.
నిద్రపోతుండగా ముంచెత్తిన వరద
శిమ్లా జిల్లా రామ్‌పుర్ సబ్డివిజల్ పరిధిలోని సమాఘ్ ఖుద్లో బుధవారం అర్ధరాత్రి 1 గంటకు ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 28 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని శిమ్లా జిల్లా పోలీస్ సూపరిండెంటెంట్ సంజీవ్ కుమార్ గాంధీ వెల్లడించారు. వరదలో కొట్టుకుపోతున్న ఇద్దరిని కాపాడినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎప్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), పోలీసులు కలిసి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు. గల్లంతైన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నట్లు వివరించారు. అయితే, ఆకస్మిక వరదల కారణంగా ఆ ప్రాంతంలో అనేక చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు వంతెనలు కొట్టుకుపోయాయి. ఫలితంగా సహాయక బృందాలు చేరుకునేందుకు ఇబ్బంది ఎదురవుతోంది.
మండి జిల్లాలో వరద
మండి జిల్లా పదర్లోని తాలాటుఖోద్ ప్రాంతంలోనూ ఆకస్మిక వరద సంభవించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించారు. 9 మంది గల్లంతయ్యారు. కొన్ని ఇళ్లు కుప్పకూలగా, రోడ్లు దెబ్బతిన్నాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రంగాం- వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరింది.