One Nation One Election India :దేశంలో ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం, రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించింది. అనంతరం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్టవ్ వెల్లడించారు.
దేశంలోని పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయా పార్టీల నేతలు మరోసారి తమ అభిప్రాయాలు చెబుతారని అన్నారు. జమిలి ఎన్నికలను దేశాన్ని బలోపేతం చేసే అంశంగా వర్ణించారు. మరోవైపు, జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జమిలి ఎన్నికలు ఆచరణాత్మకం కాదు: ఖర్గే
జమిలి ఎన్నికలు ఆచరణాత్మకం కాదని, ఇది ప్రజలు దృష్టి మరల్చేందుకు చేసే బీజేపీ ప్రయత్నమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు వాస్తవ సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి బీజీపీ ఇలాంటి వాటిని తెరపైకి తెస్తోందని ఆరోపించారు. తమ పార్టీ జమిలి ఎన్నికలకు మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో జమిలి ఎన్నికలు సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాలని వ్యాఖ్యానించారు ఖర్గే.
ప్రతిపక్షాల్లో అంతర్గత ఒత్తిడి
అయితే ఖర్గే వ్యాఖ్యలపై కూడా మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. జమిలి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలు అంతర్గత ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. 80 శాతానికిపైగా ప్రజలు జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపారని తెలిపారు. ముఖ్యంగా యువత ఆసక్తి కనబరిచారని చెప్పారు.
ప్రస్తుత ఎన్డీఏ సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు. గత నెల స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదోఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనినుంచి బయటపడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక హామీల్లో జమిలి ఎన్నికలు ఒకటి.