Kullu Manali Rains:దేశ పర్యటక ప్రదేశమైన మనాలీ సమీపంలోని పాల్చన్‌ను గురువారం కుంభవృష్టి ముంచెత్తింది. దీంతో ఆక్కడి వాతావరణం ప్రమాదకరంగా మారింది. అదే ప్రాంతంలో ఉన్న అంజనీ మహాదేవ్ కాలువ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. మనాలీకి 15 కి.మీ. దూరంలో మెరుపు వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అర్థరాత్రి 1గంట సమయంలో అంజనీ మహాదేవ్ కాలువ నుంచి తీవ్రమైన శబ్ధం రావడం వల్ల స్థానికులు ఉలిక్కిపడి లేచారు. వీరి నివాసాలు కాలువ ఒడ్డనే ఉన్నాయి. వరదలతో అప్రమత్తమైన స్థానికులు మెరుపు వరదను గమణించి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకున్నట్లు పాల్చన్ పంచాయతీ సభ్యురాలు రమాదేవీ వెల్లడించారు.
కాగా, మనాలీ- లేహ్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన మీదకు కాలువలోని భారీ బండరాళ్లు కొట్టుకొచ్చాయి. దీంతో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఇది కీలకమైన లద్ధాఖ్‌ను, దేశంలోని మిగిలిన ప్రదేశాలతో కలిపే మార్గం. వర్షం కారణంగా ఇక్కడి నాలాలో కూడా భారీగా వరద నీరు చేరింది. ఈ వరదలకు పల్చన్, రూడా, కులాంగ్ గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇప్పటివరకు రెండు ఇళ్లు కొట్టుకుపోయాయని సమాచారం. ఈ వరదల్లో ప్రాణనష్టం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఇక రోహ్‌తంగ్ పాస్ నుంచి లాహౌల్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
నేడు కూడా
భారీ వర్షాలు గురువారం మొత్తం కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రత కూడా 15 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ భారీ వర్షాలు ఇప్పటివరకు ఆనకట్టలపై ఎలాంటి ప్రభావం చూపలేదు.
మహారాష్ట్రనూ ముంచెత్తిన భారీ వర్షాలు
భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని నగరం ముంబయి జలమయంగా మారింది. వర్షాల ప్రభావం విమానాల రాకపోకలపై కూడా పడింది. దీంతో ఎయిర్‌లైన్ సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. వర్షం కారణంగా విమాన సమయాల్లో మార్పులు ఉంటాయని, ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందు ప్రయాణికులు ఓసారి ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని స్పైస్‌జెట్, ఇండిగో సంస్థ సూచించింది.