Hathras Stampede Incident : ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట ఘటన తర్వాత పరారీలో ఉన్న భోలే బాబాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మెయిన్‌పురిలో బాబాకు చెందిన ఆశ్రమంలో సోదాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు బలగాలను అక్కడే మోహరించినా, ఇంతవరకు బాబా ఆచూకీ లభ్యం కాలేదు. ఇదిలా ఉండగా ఈ దుర్ఘటనపై బుధవారం తొలిసారిగా భోలే బాబా స్పందించాడు. దర్యాప్తునకు సహకరిస్తామని తెలిపాడు.
దొరకని బాబా ఆచూకీ
మెయిన్‌పురిలో భోలే బాబాకు చెందిన నరామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో బుధవారం సోదాలు చేశామని, అక్కడే ఆయన కోసం పోలీసుల బలగాలను మోహరించామని డీఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు. 'ఆశ్రమంలో 40-50 మంది బాబా అనుచరులు ఉన్నారు. అతడి కోసం వెతికినా ఎక్కడ కనిపించలేదు. ఇప్పటి వరకు బాబా ఆచూకీ గురించి తెలియదు' అని తెలిపారు.
'దర్యాప్తునకు సహకరిస్తా'
మరోవైపు హాథ్రస్ తొక్కిలాసట జరిగిన ఒకరోజు తర్వాత భోలే బాబా స్పందించాడు. వేదిక నుంచి తాను వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఈ ఘటన జరిగిందని తెలిపాడు. ప్రభుత్వం చేపట్టే దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నాడు. ఈ దుర్ఘటన వెనక అసాంఘిక శక్తుల కుట్ర ఉందని ఆరోపించాడు. ఈ మేరకు అతని తరఫు న్యాయవాది బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే భక్తులను అతడి భద్రత సిబ్బంది తోసివేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నట్లు సమాచారం.