Haryana Political Change :లోక్‌సభ ఎన్నికల వేళ హరియాణా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, తమ ప్రభుత్వానికి ఢోకా లేదని అధికార పార్టీ చెబుతోంది. తాజాగా ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ప్రకపంనలు తలెత్తాయి. ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని రాష్ట్రపతి పాలన పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సేఫ్గా ఉందా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
'కాంగ్రెస్ అవిశ్వాసం పెడితే మద్దతిస్తాం'
హరియాణాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మైనార్టీలో పడిందన్న వార్తల నేపథ్యంలో జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే, అందుకు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
సైనీ ప్రభుత్వానికి మంగళవారం ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడమే కాకుండా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో J.J.P.అధినేత దుష్యంత్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సైనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే, తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని తెలిపారు. సైనీ ప్రభుతాన్ని పడగొట్టే విషయమై కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని J.J.P.అధినేత దుష్యంత్‌సింగ్ చౌతాలా అన్నారు. హరియాణాలో బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడినందున, నైతికత ఆధారంగా సీఎం సైనీ సభలో మెజార్టీ నిరూపించుకోవాలని లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీతో మళ్లీ జతకట్టే ప్రసక్తే లేదని దుష్యంత్‌సింగ్ చౌతాలా స్పష్టం చేశారు.
ప్రభుత్వం బలంగా ఉంది : సీఎం
మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దృఢంగా ఉందని బుధవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ అనవసరంగా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుందని ఆరోపించారు. హరియాణా ప్రజల అవసరాల కోసం కాకుండా, కొంతమంది వ్యక్తిగత ఆశలను తీర్చడానికే ప్రతిపక్ష పార్టీ ఆలోచిస్తున్నట్లు విమర్శించారు.