Haldwani Violence Today : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున చెలరేగిన హింసలో ఆరుగురు ఆందోళనకారులు మరణించారు. మరో 300 మంది గాయపడ్డారు. పోలీసులతో పాటు మదర్సాను కూల్చివేయడానికి వచ్చిన మున్సిపల్ కార్మికులపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు సహా నలుగురు ఆందోళనకారులు మరణించగా, రాళ్ల దాడిలో 300 మందికిపైగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో పోలీసులు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హల్ద్వానీలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం
Illegal Mazars In Uttarakhand : నగరంలోని బన్‌భూల్‌పుర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా మదర్సాతోపాటు మసీదును నిర్మించారు. వాటిని తొలగించాలని గతంలో నిర్వాహకులకు నోటీసు ఇచ్చినా స్పందించలేదు. దీంతో గురువారం ఉన్నతాధికారులు కోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు మధ్య మదర్సా, మసీదుల కూల్చివేతకు సిద్ధమయ్యారు. వారిని స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపారు. అయినప్పటికీ అధికారులు బుల్డోజరుతో మదర్సాను కూల్చివేయించారు. దీంతో ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వడమే కాకుండా పలు వాహనాలకు నిప్పుపెట్టారు. వనభూల్‌పురా పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చివేత హెచ్చరికలు జారీ చేశారు.