Gyanvapi Prayer Order Allahabad HC :ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు కొనసాగించవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. హిందువులు పూజలు చేసుకోవచ్చన్న వారణాసి జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. జిల్లా కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు లేవని తేల్చిచెప్పింది.
పరిశీలకుడిగా జిల్లా మెజిస్ట్రేట్
మసీదులోని 'వ్యాస్ తెహ్‌ఖానా' అని పిలిచే దక్షిణ నేలమాళిగలో హిందువులు పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు జనవరి 31న ఆదేశాలు జారీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్‌ను వ్యాస్ తెహ్ఖానాకు పరిశీలకుడిగా నియమిస్తూ జనవరి 17న ఉత్తర్వులిచ్చింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వే నివేదిక ఆధారంగా అక్కడ హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నట్లు వారణాసి కోర్టు నిర్ధరించింది. ఈ క్రమంలో ఆ రెండు ఉత్తర్వులను మసీదు కమిటీ హైకోర్టులో సవాల్ చేసింది. వ్యాజ్యంపై ఫిబ్రవరి 15న విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది.
"జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకోవచ్చని ఈ రోజు అలహాబాద్ హై కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ప్రదేశంలో అప్పట్లో హిందువులు మతపరమైన ఆచారాలు పాటించేవారని కోర్టు కూడా అంగీకరించింది. కాగా, ఎటువంటి ఆధారాలు లేకుండా 1993లో మసీదు ప్రాంగణంలో పూజలు చేయడాన్ని నిషేధించారు. దీనిని సవాలు చేస్తూ మేము వేసిన పిటిషన్‌పై వారణాసి జిల్లా కోర్టు విచారణ చేపట్టి మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై హైకోర్టుకు వెళ్లిన అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సభ్యులకు ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ కూడా సమర్థిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చారు."
- సుభాశ్ నందన్ చతుర్వేది, న్యాయవాది