తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజలకు కోర్టు ఓకే- వారం రోజుల్లో అన్ని ఏర్పాట్లు!

Gyanvapi Case Update Today : జ్ఞానవాపి కేసు కీలక మలుపు తిరిగింది. మసీదు ప్రాంగణంలో గుడి వైపు పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి మంజూరు చేసింది వారణాసి జిల్లా కోర్టు. వారం రోజుల్లోగా పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Gyanvapi Case Update Today
Gyanvapi Case Update Today

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 3:57 PM IST

Updated : Jan 31, 2024, 7:21 PM IST

Gyanvapi Case Update Today :ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో జిల్లా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో సీల్‌ చేసి ఉన్న బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతినిచ్చింది. వారం రోజుల్లోగా పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. బారికేడ్లు తొలగించాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశాలు జారీ చేసింది. కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన అర్చకులతో పూజలు చేయించాలని కోర్టు సూచించినట్లు హిందూ మహిళల తరఫు న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ వెల్లడించారు.

యాజమాన్య హక్కుల కోసం పోరాటం
వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులను ఆరాధించడానికి అనుమతివ్వాలంటూ కొంతమంది మహిళలు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ జరిపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది వారణాసి కోర్టు.

అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వాజూఖానా మినహా మసీదు ప్రాంగణమంతా కార్బన్‌ డేటింగ్‌, ఇతర పద్ధతులతో భారత పురావస్తు విభాగం సర్వే చేసింది. ఈ సర్వేలో కీలక విషయాలు బయటపడినట్లు హిందువుల తరఫు న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ ఇటీవల తెలిపారు. మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలున్నట్లు సర్వే నివేదిక పేర్కొందని వెల్లడించారు. ఆ ప్రాంగణంలో తెలుగు, కన్నడ, దేవనాగరి సహా 34 భాషల్లో ఉన్న శాసనాల ఆనవాళ్లు లభించినట్లు పేర్కొన్నారు. ఈ ఆలయానికి సంబంధించిన స్తంభాలకే కాస్త మార్పులు చేసి మసీదు నిర్మాణంలో వినియోగించినట్లు సర్వే తేల్చిందని తెలిపారు.

మసీదు కమిటీకి నోటీసులు
మరోవైపు, జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని వాజూఖానాలోనూ పురావస్తు శాఖ సర్వే నిర్వహించాలన్న పిటిషన్‌పై అలహబాద్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. వాజూఖానాలోనూ పురావస్తు శాఖ సర్వే నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కొందరు హిందువులు దాఖలుచేసిన పిటిషన్‌ను వారణాసి కోర్టు తోసిపుచ్చగా వారు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన అలహాబాద్‌ హైకోర్టు, జ్ఞానవాపి మసీదు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న అంజుమాన్ ఇంతెజామియా మసీదు కమిటీకి నోటీసులు ఇచ్చింది. వాజూఖానాలో శివలింగం బయటపడిందని, ఈ అంశంపై పురావస్తు శాఖ సర్వే నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరుతున్నారు. మరోవైపు ఇదే అంశంపై కొందరు హిందూ మహిళలు మంగళవారం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.

జ్ఞానవాపి శాస్త్రీయ సర్వే- డబుల్​ లాకర్​లో 300కుపైగా ఆధారాలు, పురాతన మత చిహ్నాలు సైతం!

'జ్ఞానవాపి మసీదులో త్రిశూలం ఏం చేస్తున్నట్టు? తప్పును వారే అంగీకరించి సరిదిద్దుకోవాల్సింది'

Last Updated : Jan 31, 2024, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details