Guidelines For Ayodhya Devotees :అయోధ్య బాలరాముడి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తర్వాత రోజు నుంచే లక్షల్లో యాత్రికులు విచ్చేస్తున్నారు. ఇదే అదనుగా కొంత మంది మోసగాళ్లు మాయమాటలు చెప్పి యాత్రికులను మోసం చేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గుర్తించింది. తాజాగా భక్తులకు పలు సూచనలు చేసింది.
60 నుంచి 75 నిమిషాల్లోనే రామయ్య దర్శనం
రామ్‌లల్లాను ఉదయం 6 గంటల 30నిమిషాల నుంచి రాత్రి 9 గంటల30 నిమిషాల వరకు భక్తులు దర్శించుకోవచ్చని ట్రస్ట్ తెలిపింది. ఆలయానికి వచ్చిన భక్తులు 60 నుంచి 75 నిమిషాల్లోనే బాలరాముడి దర్శనం చేసుకోవచ్చని వెల్లడించింది. భక్తుల ఫోన్లు, చెప్పులు, పర్స్‌లు ఆలయానికి బయటే వదిలి రావాలని సూచించింది. దయచేసి ఆలయంలోకి దండలు, పూలు, ప్రసాదాలను తీసుకరావద్దని భక్తులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరింది.
మూడు హారతులకే పాసులు జారీ
ఉదయం 4 గంటలకు ఇచ్చే మంగళహారతి, 6 గంటల 15 నిమిషాలకు ఇచ్చే శృంగార్ హారతి, రాత్రి 10 గంటలకు ఇచ్చే శయన హారతికి మాత్రమే ఎంట్రీ పాస్‌లు అవసరమని ఆలయ ట్రస్ట్ తెలిపింది. మిగిలిన ఏ హారతికి అనుమతి పత్రాలు అవసరం లేదని పేర్కొంది. ఈ పాసులను ఆన్‌లైన్‌లో ఉచితంగా పొందవచ్చని ట్రస్ట్ వెల్లడించింది.
వారితో మోసపోవద్దు!
ప్రత్యేక దర్శనాలు అని చెప్పి డబ్బులు వసూలు చేసే వారిని నమ్మి మోసపోవద్దని ట్రస్ట్ భక్తులకు జాగ్రత్త చెప్పింది. దివ్యాంగుల సౌకర్యార్థం వీల్‌చైర్లు అందుబాటులో ఉన్నాయని, ఇవి కేవలం రామమందిరానికి మాత్రమే పరిమితమని తెలిపింది. దీనికిగాను ఎటువంటి రుసుము వసూలు చేయమని తెలిపారు. దానిని నడిపే వాలంటీర్‌కు మాత్రం నామమాత్రపు రుసుము ఇవ్వల్సి ఉంటుందని పేర్కొంది.
అయితే అయోధ్యలో రామాలయ సముదాయ నిర్మాణం 2024 డిసెంబరు నాటికి పూర్తవుతుందని ట్రస్ట్ ఇటీవలే తెలిపింది. ప్రస్తుతం 1,500 మంది కార్మికులు ఆలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, త్వరలో మరో 3,500 మందిని అదనంగా నియమించుకోనున్నట్లు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్ర వివరించారు. కార్మికుల సంఖ్య పెంపుతో ఆలయంపై రెండు అంతస్తుల పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.