Goldy Brar Death :ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు. అమెరికాలోని హోల్ట్ అవెన్యూలో మంగళవారం సాయంత్రం 5.25 గంటలకు మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తన స్నేహితుడితో కలిసి ఇంటి బయట నిలబడి ఉన్న సమయంలో అతడిని గుర్తు తెలియని దుండగలు కాల్చి చంపి పారిపోయినట్లు వివరించింది. కాగా దీనిపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరపగా ఓ వ్యక్తి మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. గోల్డీ బ్రార్ ప్రత్యర్థులైన ఆర్ష్ దల్లా, లఖ్బీర్ లండా ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఈ హత్యపై గోల్డీ బ్రార్‌కు సంబంధించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఎవరీ గోల్డీ బ్రార్?
గోల్డీ బ్రార్ అసలు పేరు సతీందర్ సింగ్. ఇతడు పంజాబ్‌లోని శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన సూత్రధారి లారెన్స్ బిష్ణోయ్‌తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్‌కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతోపాటు పలువురికి బెదిరింపు ఫోన్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని హత్య కేసుల్లోనూ గోల్డీ బ్రార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గతంలో యూత్ కాంగ్రెస్ నేత గురులాల్ పహల్వాన్ హత్యకేసులో కూడా అతడి పేరు బయటకు వచ్చింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను హత్య చేస్తామంటూ బెదిరించాడు.