Ghaziabad Milk Van Viral Video : ఒక్క కాకి చనిపోతే వంద కాకులు చుట్టూ చేరి అరుస్తాయి. ఓ కోతి చనిపోతే మిగతా కోతులు దాని చుట్టు చేరి కనీరు కారుస్తూ ఆ దరిదాపుల్లోకి ఎవ్వరినీ రానివ్వువు. కానీ కొన్ని జంతువులు తమ తోటి జంతువులు చనిపోతే కనీసం స్పందించను కూడా స్పందించవు. అలాంటి జంతువుల నుంచి మనిషిని వేరు చేసేదే ఆ మానవత్వం. మనుషుల్లో అలాంటి మానవత్వం చచ్చిపోయిందని నిరుపించే ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజియాబాద్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. దిల్లీ - మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, గాయపడిన వారికి సహాయ పడాల్సిన స్థానికులు మానవత్వాన్ని మరిచారు. ఈ ప్రమాదంలో పాల ట్యాంకర్ నుంచి లీకైన పాలను బాటిళ్లలో పట్టుకుపోయారు. వారి కళ్లముందే మృత దేహం ఉన్నా తమకు పట్టనట్లుగా వ్యవహించారు. ఈ దారుణ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు వ్యవహరించిన తీరుపట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే :గాజియాబాద్‌లో మంగళవారం మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాల ట్యాంకర్‌ను వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఝార్ఖండ్‌కు చెందిన లారీ డ్రైవర్ ప్రేమ్ సాగర్ (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. లారీ క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మేరఠ్ వెళ్తుండగా దిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఏబీఈఎస్ కాలేజ్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.