TG Education Department Focus On Inter Study Plans : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇంకా 3 నెలలే సమయం ఉంది. దీంతో కళాశాలల వారీగా 90 రోజుల ప్రణాళిక రూపొందించింది. ప్రతి విద్యార్థి ఎలా చదుతున్నాడని తెలుసుకొని వెనకబడిన వారి కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నారు. కళాశాలలకు రాని విద్యార్థులు వారి తల్లిదండ్రలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడు కృష్ణ ఆదిత్య రాష్ట్రంలోని 428 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇంటర్ విద్యాశాఖ జిల్లా నోడల్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. అందులో కీలక నిర్ణయాలు తీసుకుని కార్యాచరణ రూపొందించారు.
ఉత్తీర్ణత పెంచడమే లక్ష్యం : అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండేళ్లు కలిపి 1.80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని కళాశాలలో సగం మంది విద్యార్థులు కూడా తరగతులకు హాజరు కావటం లేదు. దీంతో ఉత్తీర్ణత 50 శాతానికి మించడం లేదు. 2023లో ఫస్టియర్‌లో 40% మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. ఈ క్రమంలో గత మూడేళ్ల గణాంకాలను పరిశీలించిన కృష్ణ ఆదిత్య కళాశాలకు హాజరుకాని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి మాట్లాడాలని తెలిపారు. రెండు, మూడుసార్లు పిలిచినా రాకుంటే వారి పేర్లను తొలగించాలని సూచించారు.
తల్లిదండ్రులతోనూ సమావేశాల నిర్వహణ : చదువులో ప్రతి విద్యార్థి ఎంత చదువుతున్నాడో గమనించి వెనకబడి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని అధ్యాపకులకు తెలిపారు. అన్ని సబ్జెక్టుల వారీగా ప్రణాళిక రూపొందించి 90 రోజులు అమలు చేయాలన్నారు. అందుకు కళాశాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని నివేదిక పంపాలని తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల వారీగా 2వ తేదీన సమావేశాలు నిర్వహించనున్నారు.
సమస్యలపై ప్రతిపాదనలు : తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే ఏడు డీఐఈవో పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే మరో 26 పోస్టులను మంజూరు చేయాలి. 60 కళాశాలలకు శాశ్వత ప్రిన్సిపాళ్లు లేరు. దాదాపు 300 ప్రైవేట్ కళాశాలలు గృహ, వాణిజ్య సదుపాయాల్లో కొనసాగుతుండటంతో వాటికి అగ్నిమాపక శాఖ అనుమతి రాలేదు.దీంతో వాటికి ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు జారీ చేయలేదు. ఈ మూడు సమస్యలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించాలని కృష్ణ ఆదిత్య నిర్ణయించారు.
ఇవీ నిర్ణయాలు ఆదేశాలు
- ప్రతి కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. విద్యార్థుల స్థాయిని వారికి వివరించి, రానున్న 90 రోజులపాటు పిల్లలకు సహకరించాలని కోరాలి.
- డిసెంబరు నెలాఖరుకు సిలబస్ పూర్తి చేయాలి. డీఐఈఓలు ప్రతి కళాశాల్లోని ప్రిన్సిపాళ్లకు, అధ్యాపకులకు సూచనలివ్వాలి.
- ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఒక మహిళా, ఒక పురుష అధ్యాపకులను కౌన్సెలర్లుగా నియమించాలి. ఎవరైనా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటే కౌన్సెలింగ్ నిర్వహించాలి.
- టెలీమానస్ టోల్‌ఫ్రీ నంబరులో అందుబాటులో ఉండే సైకాలజిస్టుల సేవలు పొందాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు జరగకుండా చూడాలి.
- కళాశాలలో తప్పకుండా కనీసం నాలుగు సీసీ కెమెరాలు అమర్చాలి. ఇప్పటికే అద్దెవి ఉంటే వాటి స్థానంలో కొత్తవి కొనాలి. అవసరమైతే నాలుగు కంటే ఎక్కువ ఏర్పాటు చేసుకోవచ్చు.
- ప్రతి ప్రభుత్వ కళాశాలకు ప్రయోగశాలల కోసం వారం రోజుల్లో రూ.25 వేల చొప్పున మంజూరు చేయాలని తెలిపారు.
ఈ కాలేజీలో సీటు దొరికితే ఉద్యోగం వచ్చినట్లే! - కోర్సు పూర్తయ్యే నాటికి చేతిలో కొలువు పక్కా!!
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదల - చివరి తేదీ ఇదే!