Andhra Pradesh Elections 2024 Result Counting Process: దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి.. ఇక, రిజల్ట్ మాత్రమే బాకీ. దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుస్తుందంటూ మెజారిటీ సర్వేలు తేల్చాయి. దీంతో జూన్ 4వ తేదీన వెల్లడయ్యే అసలు ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. అయితే.. ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రం లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఓట్లను ఎలా లెక్కిస్తారో.. లోపల ఎంత తతంగం ఉంటుందో మీరెప్పుడైనా చూశారా? ప్రతీ రౌండ్ ఫలితం బయటకు ఎలా వస్తుందో తెలుసా? "తెలియదు" అంటే మాత్రం.. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
కౌటింగ్ కేంద్రం అదే..:పోలింగ్ జరిగిన రోజున ఈవీఎంలను.. ఆ నియోజకవర్గంలోనే ఒక ప్రాంతంలో భద్రపరుస్తారు. దాన్నే "స్ట్రాంగ్ రూమ్" అంటారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం కూడా అదే. అందులోనే ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ టేబుల్స్ 14 ఉంటాయి. ఒక్కో టేబుల్ మీద ఒక్కో ఈవీఎం ఉంచి ఓట్లను లెక్కిస్తారు. ఈ 14 ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెల్లడించే ఫలితాన్నే.. ఒక రౌండ్ రిజల్ట్ అంటారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో నమోదైన ఓట్ల సంఖ్యను బట్టి.. రౌండ్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది.
ఈవీఎం ఎలా తెరుస్తారు?:EVM యంత్రంలోని రిజల్ట్ విభాగానికి ఒక సీల్ ఉంటుంది. ముందు దాన్ని తొలగిస్తారు. EVM బయటి కప్పును మాత్రమే ఓపెన్ చేస్తారు. లోపలి భాగాన్ని తెరవరు. ఆ తర్వాత ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు. అనంతరం.. లోపల ఒక బటన్ తీరుగా మరో సీల్ ఉంటుంది. దాన్ని తొలగిస్తే లోపల రిజల్ట్స్ బటన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కితే.. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ వివరాలను అధికారులు జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్..:కౌంటింగ్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. EVMల కోసం ఏర్పాటు చేసే 14 టేబుళ్లు కాకుండా.. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా మరో టేబుల్ ఉంటుంది. ఈ పోస్టల్ ఓట్లు లెక్కించిన అరగంట తర్వాత.. EVM ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. ఒకవేళ పోస్టల్ ఓట్లు అరగంటలో పూర్తికాకపోయినా.. EVM ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు.