General Election First Phase Notification : దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఫలితంగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈనెల 27 కాగా, 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 30న వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది.
తమిళనాడులో 39, రాజస్థాన్‌లో 12, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో ఐదేసి స్థానాలకు తొలి విడత పోలింగ్ జరగనుంది. బిహార్‌లో 4, బంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయాల్లో రెండేసి, ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది.
అయితే నామినేషన్ల పరిశీలన మార్చి 28న ఉండగా, బిహార్‌లో మాత్రం ఈ నెల 30న ఉంటుంది. అభ్యర్థులు ఏప్రిల్ 2 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ 18వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19 జరగనుండగా, ఆ తర్వాత ఆరు దశల్లో ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఓట్లు లెక్కింపు ఉంటుంది. అయితే ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్లో తాజాగా కొన్ని మార్పులు చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలో కౌంటింగ్‌ను జూన్ 4 నుంచి జూన్ 2వ తేదీకి మార్చింది.