తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికాలో గ్యాంగ్​స్టర్​ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడి అరెస్టు - ANMOL BISHNOI ARRESTED IN US

యూఎస్​లో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ అరెస్ట్​!

Gangster Lawrence Bishnoi and his brother Anmol
Gangster Lawrence Bishnoi and his brother Anmol (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 8:30 PM IST

Updated : Nov 18, 2024, 8:40 PM IST

Anmol Bishnoi Arrested In US :గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ అమెరికాలో అరెస్ట్ అయినట్లు సమాచారం. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి బయట కాల్పులు జరిపిన ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతని సూచనల మేరకే ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు నిందితులు వెల్లడించిన విషయం తెలిసిందే.

చాలా కేసులున్నాయ్​!
కొన్ని నెలల క్రితం హిందీ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల జరిపిన ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్‌ బిష్ణోయ్​పై ఆరోపణలు ఉన్నాయి. 2022లో హత్యకు గురైన పంజాబ్‌ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులోనూ ఇతనే అనుమానితుడిగా ఉన్నాడు. అలాగే ఇటీవల ముంబయిలో సంచలనం సృష్టించిన బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితులతో ఇతను టచ్‌లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

అన్మోల్ బిష్ణోయ్​ కెనడాలో నివసిస్తున్నట్లు సమాచారం. అతను చాలా తరచుగా అమెరికా వెళ్లి వస్తుంటాడని తెలుస్తోంది. జైలులో ఉన్న తన సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ తరఫున అన్మోల్​ ఎన్నో క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం యూఎస్​లో పట్టుబడినట్లు తెలుస్తోంది.

భారత్​కు రప్పించేందుకు!
ముంబయి పోలీసులు ఇటీవలే అన్మోల్‌ను భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. లారెన్స్‌ బిష్ణోయ్​ తరఫున అన్మోల్ పలు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగమయ్యాడని సదరు పిటిషన్​లో పేర్కొన్నారు. దీంతో అన్మోల్​పై నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఈ క్రమంలోనే అన్మోల్‌ కదలికల గురించి అమెరికా అధికారులు ముంబయి పోలీసులను అలెర్ట్‌ చేయగా, తాజాగా కాలిఫోర్నియాలో అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం తెలుస్తోంది.

జైల్లోనే ఉంటూ హత్యలకు ప్లాన్స్!
గ్యాంగ్​స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. బ్యారక్​ల్లోకి అక్రమంగా వచ్చే సెల్‌ ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్​లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడని అతనిపై ఆరోపణలున్నాయి. గాయకుడు సిద్ధూ మూసేవాలా, ఎన్ సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీపై దాడులు ఈవిధంగానే చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్​పై పలుమార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు పాల్పడింది. గతేడాది రెండుసార్లు సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా సల్మాన్​​కు బెదిరింపు హెచ్చరికలు పంపింది. చివరిసారిగా 2023 నవంబర్​లో​ 'మరణానికి వీసా అవసరం లేదు' అంటూ సల్మాన్​ను హెచ్చరించారు. అయితే కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్​ల మనోభావాలను సల్మాన్‌ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై సల్మాన్​కు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు గతంలో పోలీసులు పేర్కొన్నారు.

Last Updated : Nov 18, 2024, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details