Construction EPS Blocks :వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది ఎయిర్ కండీషనర్ల వినియోగాన్ని పెంచుతున్నారు. అయితేే దీనివల్ల అధిక ఉష్ణోగ్రతల సమస్య మరింత తీవ్రరూపు దాలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్ట్రక్చర్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్(SERC) సాంకేతిక పరిష్కారాన్ని సిద్ధం చేసింది. అదే ఈపీఎస్ కన్‌స్ట్రక్షన్ బ్లాక్ (EPS construction blocks) టెక్నాలజీ.
ఈ సాంకేతికత విస్తృతంగా వినియోగంలోకి వస్తే నిర్మాణ రంగ భవిష్యత్తు రూపురేఖలు మారిపోతాయి. ఈపీఎస్ కన్‌స్ట్రక్షన్ బ్లాక్‌లతో ఇళ్లను నిర్మించుకుంటే నిర్మాణ వ్యయం బాగా తగ్గిపోతుంది. అంతేకాదు సమ్మర్‌లో ఇళ్లపై వడగాలుల ప్రభావం పెద్దగా పడదు. ఎస్‌ఈఆర్‌సీ చెన్నై క్యాంపస్ డైరెక్టర్ అనంతవల్లి అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అవేంటో చూద్దాం.
ఏమిటీ ఈపీఎస్ బ్లాక్‌లు? ఎలా పనిచేస్తాయి?
ఈపీఎస్ అంటే ఎక్స్‌ప్యాన్డెడ్ పాలీస్టైరీన్. ఇదొక రకం ప్లాస్టిక్. ఈపీఎస్ బ్లాక్‌లు చాలా తేలిగ్గా ఉంటాయి. కాంక్రీట్ ప్రీకాస్ట్ ఈపీఎస్‌ల అంతటి బరువును కలిగి ఉంటాయి. ఇవి నీటిలో తేలుతాయి. "బ్రెడ్ ఆమ్లెట్‌లు ఎలాగైతే కలగలిసి ఉంటాయో అదే తరహాలో ఈపీఎస్ బ్లాక్‌లను రూపొందిస్తారు. రెండు బ్రెడ్ ముక్కలను సిమెంట్‌తో, వాటి మధ్యలో ఆమ్లెట్ తరహాలో థర్మకోల్ ఉంటాయి. ఇందులోని అంతర్గత బ్లాక్‌లలో స్టీల్ బ్లాక్స్ ఉంటాయి. ఫలితంగా ఈపీఎస్ బ్లాక్‌లు దృఢంగా తయారవుతాయి" అని ఎస్‌ఈఆర్‌సీ చెన్నై క్యాంపస్ డైరెక్టర్ అనంతవల్లి తెలిపారు. "ఈ బ్లాక్‌లలో ఉండే అతిసూక్ష్మ రంధ్రాల నుంచి థర్మల్ ఇన్సులేషన్ ధారాళంగా జరుగుతుంది. దీనివల్ల అవి వేడెక్కడానికి, చల్లబడటానికి ఎక్కువ శక్తిని వినియోగించవు" అని ఆమె వివరించారు.
ఈపీఎస్ బ్లాక్స్‌తో నిర్మాణం (ETV Bharat) నమూనా భవనం రెడీ
"మేం చాలా ఏళ్లుగా ఈపీఎస్ బ్లాక్ నిర్మాణ రంగ సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం" అని వెల్లడించారు. "ప్రయోగాత్మకంగా ఈపీఎస్ బ్లాక్‌లతో మేం ఇప్పటికే ఒక నమూనా భవనాన్ని నిర్మించాం. పర్యావరణ హితంగా ఉండేలా దాన్ని తీర్చిదిద్దాం. వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉష్ణోగ్రతలు ఎలా మారుతుంటాయి అనేది ప్రస్తుతం పరిశీలిస్తున్నాం. ఈ టెక్నాలజీని వినియోగించాలని భావించే వారికి శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నాం" అని అనంతవల్లి పేర్కొన్నారు.
ఈపీఎస్ బ్లాక్‌ల ప్రభావం వల్ల ఏసీ లేకుండానే ఇల్లు కూల్‌గా ఉంటుందన్నారు. "ఈపీఎస్ బ్లాక్‌ల తయారీ సాంకేతికతను తగిన సమయంలో ఉత్పత్తి సంస్థలకు అందించాలని భావిస్తున్నాం. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. వాటి తయారీ మొదలుకాగానే ఎవరైనా కొని, ఇంటి నిర్మాణానికి వాడుకోవచ్చు. ఇప్పటివరకైతే ఎవరికీ ఈ సాంకేతికతను ఇవ్వలేదు" అని ఆమె వివరించారు.
ఈపీఎస్ బ్లాక్స్‌తో నిర్మించిన ఇల్లు (ETV Bharat) ఇంటిని ఇలా కూల్ చేస్తుంది!
"ఈపీఎస్ బ్లాక్‌లు చాలా తేలికగా ఉండటం వల్ల వాటిని రవాణా చేయడం, పైకి ఎత్తడం సులభతరం. దీనివల్ల నిర్మాణ పనులకు అవసరమైన కూలీల సంఖ్య తగ్గిపోతుంది" అని అనంతవల్లి తెలిపారు. ఈపీఎస్ బ్లాక్‌లతో నిర్మించుకునే ఇళ్లలోని ఉష్ణోగ్రత, బయటి వాతావరణం కంటే 9 డిగ్రీలు తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో గుర్తించామని ఆమె చెప్పారు. వేడి ఇంట్లోకి ప్రవేశించకుండా ఈపీఎస్ బ్లాక్‌లు అడ్డుకుంటాయన్నారు. దీనివల్ల వేసవి కాలంలో ఎడతెరిపి లేకుండా వడగాలులు వీచినా ఇల్లు కూల్‌గానే ఉంటుందని పేర్కొన్నారు. ఈపీఎస్ బ్లాక్‌లతో 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం రూ.7 లక్షలతో ఇంటిని నిర్మించుకోవచ్చని అనంతవల్లి చెప్పారు.
ఈపీఎస్ బ్లాక్స్ (ETV Bharat) భూకంపాలను తట్టుకుని నిలిచేలా భవనాలు!
భూకంపాలను తట్టుకుని నిలువగలిగే భవనాలను నిర్మించే సాంకేతికతపై ప్రస్తుతం తాము పరిశోధనలు చేస్తున్నట్లు అనంతవల్లి వెల్లడించారు. భూకంపాల ముప్పు అత్యధికంగా ఉండే కశ్మీర్ లోయ, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్య హిమాలయ ప్రాంతం, ఉత్తర బిహార్, మధ్య బిహార్‌లలో ఈ తరహా భవనాల నిర్మాణంపై రీసెర్చ్ జరుగుతోందన్నారు. కొన్ని రకాల నిర్మాణ రంగ సాంకేతికతలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తాము రూపొందించిన పలు సాంకేతికతలు ప్రస్తుతం నాణ్యతా విశ్లేషణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పరిశీలనలో ఉన్నాయని ఆమె తెలిపారు.