Free Tuition For Poor Students : ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఎవరి సమస్యలతో వారు పోరాడటమే ఎక్కువ. ఇతరుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన వచ్చేవారు తక్కువ మందే ఉంటారు. అలాంటి జాబితాకి చెందినవాడే అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన చాన్‌ఫువా వాంగ్సు మాస్టర్. తాను చదువుకునేటప్పుడు పడిన కష్టాలు మిగతా వాళ్లు పడకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం గత ఏడేళ్ల పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెబుతూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు.
పీజీ చేస్తున్న సమయంలోనే
చాన్‌ఫువా వాంగ్సు అరుణాచల్ ప్రదేశ్‌లోని లాంగ్డింగ్ జిల్లా లాంగ్ఖావ్ గ్రామానికి చెందినవాడు. చాన్‌ఫువా వాంగ్సు చిన్పప్పుడే తండ్రి చనిపోయారు. దీంతో అమ్మే అన్నీ తానై కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లింది. చాన్‌ఫువా వాంగ్సును చదివించింది. ఈ క్రమంలో వారి కుటుంబం ఎన్నో సాధకబాధకాలను ఎదుర్కొంది. 2014లో మణిపుర్‌లోని డాన్‌బాస్కో కాలేజ్ మారమ్‌లో చాన్‌ఫువా వాంగ్సు డిగ్రీ పూర్తి చేశాడు. 2015లో పీజీ చేస్తున్న సమయంలో జేబు ఖర్చుల కోసం తన ఇంట్లో స్థానిక పిల్లలకు ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో కొన్ని నిరుపేద కుటుంబాల పిల్లలు ఫీజును కట్టలేక ట్యూషన్‌ను మానేయడాన్ని అతడు గమనించాడు. ఆ పిల్లలు ఇచ్చే కొద్దిపాటి ట్యూషన్ ఫీజు తనకూ సరిపోకపోవడం, మరోవైపు పిల్లలు ట్యూషన్ మానేస్తుండటాన్ని వాంగ్సు చూసి బాధపడ్డాడు. అప్పటి నుంచే పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పాలని నిర్ణయించుకున్నానని చెబుతున్నాడు వాంగ్సు.
'స్కూల్ డేస్‌లో నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. కొన్ని సబ్జెక్టుల్లో నేను వీక్‌గా ఉండేవాణ్ని. ట్యూషన్‌కు వెళ్దామంటే డబ్బులుండేవి కావు. అందువల్లే ఎంత కష్టపడి చదివినా నేను స్కూల్‌లో కంపార్ట్‌మెంట్ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది. మణిపుర్‌లోని డాన్‌బాస్కో కాలేజ్ మారమ్‌లో చేరడం అనేది నా జీవితంలో కీలక మలుపులాంటిది. అక్కడ నాకు మంచి స్నేహితులు దొరికారు. నేను చదువుకోవడానికి చాలా మంది ఆర్థిక సాయం చేశారు. నేను కూడా పేద విద్యార్థులకు సాయం చేయాలని నిర్ణయించుకుని ఉచితంగా ట్యూషన్ చెప్పడం ప్రారంభించాను' అని చాన్‌ఫువా వాంగ్సు తెలిపాడు.