- తెల్లని గడ్డం
- నీలం రంగు తలపాగా
- తెల్లని చొక్క
- జేబులో పెన్ను
ఇదీ దేశ ప్రధానిగా పదేళ్లపాటు పనిచేసిన మన్మోహన్ సింగ్ అతి సాధారణ ఆహార్యం. ఎంత సాధారణంగా ఉంటారో అంతటి మౌనంగానే ఉంటారాయన. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తుంటారు. 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2014 వరకూ కొనసాగారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి అభివృద్ధిపథంలో పరుగులు పెట్టేలా చేసి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచారు.
ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ!
Manmohan Singh Biography : పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు కొనసాగారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి నిశ్శబ్దంగానే వైదొలగినప్పటికీ దేశ ఆర్థిక రంగానికి వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా ఎల్‌పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.
2004లో కాంగ్రెస్ విజయం సాధించాక ప్రధాని అభ్యర్థిపై అనేక ఊహాగానాలొచ్చాయి. అయితే అనూహ్యంగా మన్మోహన్‌ను సోనియా గాంధీ ఎంపిక చేశారు. దీంతో ఆయన మే 22వ తేదీన యూపీఏ తరఫున ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ జీవితం మరో మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పథంలో పరుగెత్తించాలనే ఉద్దేశంతో పీవీ ఆయనను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 1991 జూన్‌లో మన్మోహన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు.