Food Items Not Allowed In Domestic Flight India : ప్రయాణాలు చేసేటప్పుడు తప్పనిసరిగా మనతో పాటు ఏదొక ఆహార పదార్థాలను తీసుకెళ్తాం. రైలు, బస్సు ప్రయాణాల్లో కూడా మనకు నచ్చిన వాటిని బ్యాగులో పెట్టుకుంటాం. అయితే విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాత్రం అన్నింటినికి అనుమతి ఉండదు. ముఖ్యంగా దేశీయ విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకెళ్లాలో తప్పనిసరిగా అవగాహన ఉండాలి. సాధారణంగా బిస్కెట్లు, చిప్స్, పొడిగా ఉండే స్నాక్స్, అరటిపండ్లు, యాపిల్స్ వంటివి ఉంటాయి. సీల్డ్ వాటర్, కూల్ డ్రింక్స్ కూడా అనుమతిస్తారు. అయితే భద్రత, పరిశుభ్రతతో ముడిపడిన సమస్యల కారణంగా కొన్నింటిని అనుమతించరు. ఇలాంటి వాటిలో కూరలు, గ్రేవీలు, సూప్‌లు, పెరుగు, సాస్‌లు ఉంటాయి. పచ్చి మాంసం, సముద్రపు ఆహారం, పాల ఉత్పత్తుల వంటి పాడైపోయే ఆహారాలను కూడా అనుమతించరు. ఎందుకంటే అవి రవాణా సమయంలో పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇంతకి ఎలాంటి వాటిని అనుమతి ఇస్తారో చూద్దాం.
బ్రెడ్
డొమెస్టిక్ ఫ్లైట్‌లోకి మీతో పాటు హ్యాండ్ లగేజీలో తీసుకెళ్లగలిగే ఐటమ్స్ లిస్టులో బ్రెడ్ కూడా ఉండొచ్చు. అయితే దాన్ని సరిగ్గా ప్యాక్ చేయించుకొని తీసుకెళ్లాలి. లేదంటే సూట్‌కేసులోని బ్రెడ్ ప్యాకెట్ చెల్లాచెదురై దానిలోని బ్రెడ్ ముక్కలు ఇతర వస్తువులతో కలిసిపోయే అవకాశం ఉంటుంది.
స్వీట్లు, మిఠాయి
చాక్లెట్లు, క్యాండీలను దర్జాగా హ్యాండ్ లగేజీలో తీసుకెళ్లొచ్చు. అయితే కేక్‌లలో డ్రై కేక్‌లను మాత్రమే నేరుగా మీ సూట్‌కేసులో తీసుకెళ్లేందుకు వీలుంటుంది. ఫోమ్‌తో కూడిన మౌసీ రకం కేకులను కూడా అనుమతించరు. ద్రవరూప స్వభావం కలిగిన భారతీయ సంప్రదాయ మిఠాయిలను కూడా తీసుకెళ్లనివ్వరు.
వండిన ఆహారం
వండిన ఆహారాన్ని విమానంలో తీసుకెళ్లకపోవడమే బెటర్. ఎందుకంటే వండిన ఆహారాన్ని 100 ఎంఎల్ కంటే తక్కువ మోతాదులో ఉంటేనే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. అది కూడా ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ అయి ఉండాలి. లేదంటే దాన్ని హ్యాండ్ లగేజీలోనూ తీసుకెళ్లనివ్వరు. జామ్, ద్రవరూప ఆహార పదార్థాలు కూడా నిషిద్ధం. ఈ ఐటమ్స్ విషయంలో ఒక్కో విమానయాన సంస్థ ఒక్కో విధమైన రూల్‌ను కలిగి ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరు జర్నీకి ముందే ఈ రూల్స్ గురించి తెలుసుకోండి.
నెయ్యి, నూనె
ఇండిగో విమానయాన సంస్థ నెయ్యి, నూనెలను విమానంలోని కార్గోలో వేసే చెక్ ఇన్ బ్యాగేజీలో తీసుకెళ్లేందుకు అనుమతిస్తుంది. అయితే ఎయిర్ ఇండియా చెక్ ఇన్ బ్యాగేజీ, హ్యాండ్ లగేజీ రెండింటిలోనూ నెయ్యి, నూనెలను తీసుకెళ్లేందుకు అనుమతిస్తుంది. ఇక ఆయిల్ ఫుడ్ తీసుకెళ్లడం ఇండిగో ఫ్లైట్‌లో పూర్తిగా నిషిద్ధం. పరిమిత మొత్తంలో ఆయిల్ ఫుడ్‌ను తీసుకెళ్లడానికి ఎయిర్ ఇండియా అనుమతిస్తుంది.
పండ్లు, కూరగాయలు
మామిడి పండ్ల సీజన్ దగ్గరలోనే ఉంది. మీరు వాటిని విమానంలో తీసుకెళ్లేందుకు సంకోచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిగో మీ క్యారీ-ఆన్ బ్యాగ్‌లో తాజా పచ్చి పండ్లు, కూరగాయలను తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది. అయితే వాటిని సరిగ్గా ప్యాక్ చేసుకొని తీసుకెళ్లాలి.
పిల్లల ఆహారం
మీరు ఎయిర్ ఇండియా విమానంలో పిల్లలతో ప్రయాణిస్తున్నట్లయితే మీ క్యారీ-ఆన్ బ్యాగ్‌లో ఆహారం, ఫీడింగ్ బాటిళ్లను తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. చాలా విమానయాన సంస్థలు భద్రతా ప్రమాణాలు, ఎయిర్‌లైన్ నిబంధనలను పరిగణనలోకి తీసుకొని 100 ఎంఎల్ కంటే కొంచెం ఎక్కువ బేబీ ఫుడ్‌నే విమానంలోకి తీసుకొచ్చేందుకు అనుమతి ఇస్తుంటాయి. అయితే బేబీ ఫుడ్‌ను స్పష్టంగా బయటకు కనిపించే విధంగా సీసాలలో పెట్టాలని గుర్తుంచుకోవాలి.