Assam Floods Death Toll : అసోంలో వరద బీభత్సం అంతకంతకూ పెరుగుతోంది. బుధవారం మరో 8మంది మృతిచెందగా, 27జిల్లాల పరిధిలోని 16.25 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన చేశారు. సోనిత్‌పుర్ జిల్లా తేజ్‌పుర్‌లో ఇద్దరు, మోరిగావ్, దిబ్రుగఢ్, దరాంగ్, గోలాఘాట్, బిస్వనాథ్, తిన్‌సుకియా ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు చెప్పారు. 24జిల్లాల పరిధిలోని 515 వరద సహాయక శిబిరాల్లో దాదాపు 4లక్షల మంది తలదాచుకుంటున్నారు. 8,400 మందిని సహాయక బృందాలు కాపాడినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 2,800 గ్రామాలు వరదగుప్పిట్లో చిక్కుకోగా, 42,478 హెక్టార్లలో వివిధరకాల పంటలు నీట మునిగినట్లు తెలిపారు. వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అసోంలో సంభవించిన ప్రకృతి విపత్తుల్లో చనిపోయినవారి సంఖ్య 56కు చేరినట్లు అధికారులు తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పర్యటించారు. ఖానా నదిపై నిర్మించిన ధారాపుర్ జంగ్రాబార్ డ్యామ్‌లో దెబ్బతిన్న స్లూయూస్ గేట్‌ను పరిశీలించారు. పలు ప్రాంతాలలో దెబ్బతిన్న రోడ్లు, ఆనకట్టల మరమ్మతుల పనులను త్వరగతిన పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. రెండో విడత వరదలకు అరుణాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్టే కారణమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. చైనా, భూటాన్ నుంచి కూడా వరద వస్తోందని చెప్పారు. కామ్రూప్ జిల్లాలో వరద పరిస్థితిపై సమీక్షించిన ఆయన, ఎన్డీఆర్‌ఆఫ్ బృందాలు 24 గంటలు సహాయ చర్యలు చేపడుతున్నాయనని వెల్లడించారు.