Fire At New Baby Care Centre In Delhi : దిల్లీ వివేక్ విహార్‌లోని బేబీ కేర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బేబీ కేర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లు రాత్రి 11:30గంటలకు ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చిందని అధికారి రాజేశ్ తెలిపారు. 'వెంటనే 16 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకున్నాం. దాదాపు గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. ఆస్పత్రితో పాటు పక్కనే ఉన్న మరో భవనం ధ్వంసమైంది. 12 మందిని రక్షించి వారిని ఆస్పత్రికి తరలించాం. పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి' అని రాజేశ్ తెలిపారు.
'ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే'
అయితే, ఆస్పత్రిలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భగత్ సింగ్ సేవాదళ్ అధ్యక్షుడు జితేంద్ర సింగ్ శాంతి అనుమానం వ్యక్తం చేశారు. 'ఆస్పత్రి వెలుపల ఉన్న అంబులెన్స్‌లోని సిలిండర్‌లో ఆక్సిజన్ నింపే పని జరుగుతుంది. ఆక్సిజన్ రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ పేలింది. మూడు సిలిండర్లు ఒకదాని తర్వాత మరోకటి పేలాయి. ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న భవనంలోకి కూడా వ్యాపించాయి' అని శాంతి చెప్పారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని
ఈ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని నరేంద్ర మోదీ, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిన్నారులు చనిపోవటం మనసును కలిచివేసిందని తెలిపారు. చికిత్స పొందుతున్న చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని విడిచి పెట్టబోమని దిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు.