Farmers Reject Govt Proposal :వచ్చే ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసేలా కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఎంఎస్పీపై కేంద్రం ప్రతిపాదన రైతుల ప్రయోజనాల కోసం కాదని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ ధల్లేవాల్ ఆరోపించారు. అందుకే ఎంఎస్పీపై కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని తెలిపారు.
"సమావేశంలో కేంద్ర మంత్రులు మాతో చర్చించిన విషయాలకు మీడియాకు చెప్పిన వివరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మాతో అన్ని పంటలను కొనుగోలు చేస్తామని చెప్పారు. పప్పు దినుసులపై ఎమ్‌ఎస్‌పీ కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రులు మాతో తెలిపారు. కానీ, రూ.1.75 లక్షల కోట్లు వరకు ఖర్చు చేయొచ్చని నిపుణులు అంటున్నారు. అందువల్ల కేంద్రం ప్రతిపాదనను మేం తిరస్కరిస్తున్నాం. ఫిబ్రవరి 21 దిల్లీలో శాంతియుత ర్యాలీ చేపట్టేందుకు రైతులను అనుమతించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం" అని జగ్జీత్ చెప్పారు. మరోవైపు, ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 11 గంటలకు రైతులు శాంతియుతంగా దిల్లీ వైపు వెళ్తారని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ వెల్లడించారు.