తెలంగాణ

telangana

ETV Bharat / bharat

JCBలు, క్రేన్​లతో రైతుల 'చలో దిల్లీ'- రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, గ్యాస్ మాస్క్​లు - Farmers Protest today

Farmers Protest Today : కనీస మద్దతు ధరపై కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరించిన రైతులు, మరోసారి దిల్లీ చలో కార్యక్రమానికి భారీ సన్నాహాలు చేసుకున్నారు. ఎలాగైనా దిల్లీలోకి ప్రవేశించేందుకు జేసీబీలు, హైడ్రాలిక్ క్రేన్​లతో అనేక మంది రైతులు ఇప్పటికే సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారు.

Farmers Protest Today
Farmers Protest Today

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 8:39 AM IST

Updated : Feb 21, 2024, 9:26 AM IST

Farmers Protest Today : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు మరోసారి దిల్లీ చలో కార్యక్రమానికి సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం 11 గంటలకల్లా ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే దిల్లీ చలో కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టం చేశారు. పంజాబ్-హరియాణా సరిహద్దు ప్రాంతమైన శంభు వద్ద మళ్లీ రణరంగంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అడ్డంకులన్నీ దాటేందుకు రైతులు అన్ని సన్నాహాలు చేసుకున్నారు.

జేసీబీలు, హైడ్రాలిక్ క్రేన్​లతో రైతులు రెడీ!
అయితే ఫిబ్రవరి 13వ తేదీన దిల్లీకు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడుకున్నారు. ఆ సమయంలో పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్​ను ప్రయోగించారు. దీంతో రైతులు ముందుకు సాగలేకపోయారు. అప్పటి నుంచి సరిహద్దుల్లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఎలాగైనా దిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. జేసీబీలు, హైడ్రాలిక్ క్రేన్​లతో అనేక మంది రైతులు ఇప్పటికే శంభు సరిహద్దుకు చేరుకున్నారు.

శంభు సరిహద్దు వద్ద రైతులు

గ్యాస్ మాస్క్​లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
పోలీసులు ప్రయోగించే రబ్బర్ బుల్లెట్ల బారినపడకుండా ఉండేందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తెప్పించుకున్నారు రైతులు. పలువురు కర్షకులు గ్యాస్​ మాస్క్​లను కూడా ధరించారు. సిమెంట్ బారికేడ్లను బద్దలుకొట్టేందుకు వివిధ పరికరాలను తెచ్చుకున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తిరస్కరించిన రైతులు, కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

'నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే'
ప్రధాని నరేంద్రమోదీ తమ డిమాండ్లను అంగీకరించాలని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంథేర్ శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. "మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేశాం. సమావేశాలకు హాజరయ్యాం. ప్రతీ అంశం చర్చిచాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. రూ.1.5-2 లక్షల కోట్లు పెద్ద మొత్తమేం కాదు. అడ్డంకులు తొలగించి దిల్లీకి అనుమతించాలి" అని డిమాండ్ చేశారు.

'మేం ఏం నేరం చేశాం?'
"మా ప్రాణాలు తీసినా పర్లేదు. కానీ దయచేసి రైతులను అణిచివేయద్దు. హరియాణా గ్రామాల్లో పారామిలటరీ బలగాలు మోహరించాయి. మేం ఏం నేరం చేశాం? మిమ్మల్ని మేం ప్రధానమంత్రిని చేశాం. ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. దయచేసి రాజ్యాంగాన్ని రక్షించండి. శాంతియుతంగా దిల్లీకి వెళ్లనివ్వండి. ఇది మా హక్కు" అని సర్వన్ సింగ్ చెప్పారు.

'ప్రభుత్వం పరిష్కరిస్తోంది'
అయితే శాంత్రి భద్రతలను కాపాడాలని రైతులను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా కోరారు. చర్చల ద్వారా సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఇంకా పలుమార్లు చర్చలు జరపాల్సి ఉందని చెప్పారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అందరూ శాంతి కోరుకోవాలని కేంద్రమంత్రి అన్నారు.

'తక్షణమే చర్చలు తీసుకోండి'
మరోవైపు, పంజాబ్​- హరియాణా సరిహద్దుల్లో 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సులు సహా పలు వాహనాలతో 14వేల మంది ప్రజలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. పంజాబ్​ ప్రభుత్వానికి రాసిన లేఖలో కేంద్రం ఈ మేరకు పేర్కొంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది.

శంభు ప్రాంతంలో రైతుల ముసుగులో చాలా మంది దుండగులు పోలీసులపైకి రాళ్లదాడికి పాల్పడుతున్నారని హోంశాఖ తెలిపింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలన్నింటినీ అరికట్టడానికి తక్షణమే సమీక్షించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై ట్రాక్టర్లు, జేసీబీలు సహా ఇతర భారీ పరికరాల వాడకంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

'ఏం జరిగినా కేంద్రానిదే బాధ్యత'- అప్పటివరకు కేంద్రానికి రైతుల డెడ్​లైన్

కేంద్రం ప్రతిపాదనకు రైతులు నో- మరోసారి దిల్లీ చలోకు పిలుపు

Last Updated : Feb 21, 2024, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details