Farmers Protest Delhi 2024 : పలు డిమాండ్లతో దిల్లీలో ఆందోళనలకు బయల్దేరిన పంజాబ్, హరియాణా రైతుల గురించి కొత్త విషయం బయటకొచ్చింది. దిల్లీకి దారి తీసే అన్ని ప్రధాన మార్గాల్లో పోలీసులు బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేయడం వల్ల హస్తినలోకి వెళ్లేందుకు రైతులు ఓ ప్రణాళికతో ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. 'దిల్లీ చలో' మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నా ఆందోళనలను సుదీర్ఘంగా కొనసాగించేందుకు కర్షకులు సిద్ధమైనట్టు పేర్కొన్నాయి. అందుకోసం 6 నెలలకు సరిపడా రేషన్, ప్రయాణానికి కావాల్సిన డీజిల్‌ను తెచ్చుకున్నట్టు తెలిపాయి.
గుండు పిన్ను నుంచి సుత్తి వరకు
దిల్లీకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకట్ట వేస్తే ప్రత్యామ్మాయ మార్గాల్లో నగరంలోకి ప్రవేశించాలని రైతులు ప్రణాళిక రచించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అందుకు సుదూర ప్రాంతాలను ఎంచుకున్నట్టు చెప్పాయి. నిఘా వర్గాలు తెలిపిన ఈ విషయాలు వాస్తవమేనని పలువురు రైతులు చెప్పినట్టు జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. తమ వెంట గుండు పిన్ను నుంచి సుత్తి వరకు పనిముట్లు ఉన్నట్టు రైతులు తెలిపారని పేర్కొన్నాయి. పోలీసులు ఏర్పాటు చేసిన కాంక్రీటు దిమ్మెలు, బారికేడ్లు, ముళ్లకంచెలు తొలగించగలమని కర్షకులు చెప్పినట్టు తెలిపాయి.
గురుద్వారాలు, వాహనాలే ఇళ్లు
గతంలో కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు సుదీర్ఘంగా ఆందోళనలు చేసిన రైతులు మరోసారి నెలల పాటు నిరసన చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మార్గ మధ్యలో ఆశ్రయం కోసం గురుద్వారాలు, ఆశ్రమాల్లో తలదాచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. కొందరు రైతులు తమ వాహనాలను తాత్కాలిక ఆశ్రయం పొందేలా మార్పులు చేసుకున్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే హరియాణా, పంజాబ్ సరిహద్దుల్లో పలువురు రైతులను అడ్డుకున్న పోలీసులు, దిల్లీలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాక్టర్లు, ట్రాలీలతో వస్తున్న కర్షకులను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.