తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండో రోజు రైతుల ఆందోళన- దిల్లీలో భద్రత కట్టుదిట్టం- ఇంటర్నెట్​ బంద్ - Farmer Protest Demands

Farmers Protest Delhi 2024 : తమ డిమాండ్ల సాధనకై దిల్లీ బాట పట్టిన రైతు సంఘాలు బుధవారం కూడా ఆందోళనను కొనసాగిస్తున్నాయి. బుధవారం పంజాబ్, హరియాణా సరిహద్దులతో పాటు దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా RAF బలగాలను మోహరించారు.

Farmers Protest Delhi 2024
Farmers Protest Delhi 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 10:12 AM IST

Updated : Feb 14, 2024, 12:39 PM IST

Farmers Protest Delhi 2024 :పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని మంగళవారం దిల్లీ చలోకు పిలుపునిచ్చిన రైతులు బుధవారం కూడా మార్చ్‌ను కొనసాగిస్తున్నారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. పంజాబ్, హరియాణా సరిహద్దులతో పాటు దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా RAF బలగాలను మోహరించారు. సరిహద్దుల వద్ద మరిన్ని కాంక్రీటు దిమ్మెలు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై భారీ కందకాలు తవ్వారు.

Farmers Protest 2024 Update : మంగళవారం దిల్లీ సరిహద్దుకు చేరుకున్న రైతులు రాత్రంతా రోడ్లపైనే గడిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారి కోసం బుధవారం ఉదయం టీ, అల్పాహారాన్ని సిద్ధం చేశారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా, తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. అయితే, రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని, వాటిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించొద్దని వారికి విజ్ఞప్తి చేశారు.

'వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా రైతుల సంక్షేమం కోసం గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం రైతుల డిమాండ్​లను వినేందుకు ప్రభుత్వం మంత్రులను కూడా రంగంలోకి దింపింది. ఈ క్రమంలో వారు(రైతులు) కొత్త డిమాండ్​లను తెరపైకి తెస్తున్నారు. ఇందుకు కారణం ఏంటి? ఒకవేళ కొత్త డిమాండ్స్ వినిపించినా వాటిని పరిశీలించేందుకు, రాష్ట్రాలతో చర్చించేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఇప్పటికీ రైతులతో చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. వారు మాతో చర్చలకు రావాలి. రైతులు ప్రతిపాదించిన వాటికి చాలావరకు మేము అంగీకరించాము. అయితే నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించవద్దని నేను రైతు సంఘాలను కోరుతున్నాను'
--అనురాగ్​ ఠాకూర్, ​కేంద్ర మంత్రి

'డ్రోన్​లు పంపంకండి'
హరియాణా భూభాగంలోని శంభు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతులను నిలువరించేందుకు పోలీసులు డ్రోన్​ల ద్వారా టియర్​ గ్యాస్ షెల్స్​​ను వినియోగించడంపై పంజాబ్​ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ చర్యను తాము ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పటియాలా డిప్యూటీ కమిషనర్‌ షోకత్​ అహ్మద్​ పర్రే, అంబాలా డిప్యూటీ కమిషనర్​కు లేఖ రాశారు. ఇకపై పంజాబ్ భూభాగంలోని అంబాలా-శంభు బోర్డర్​లోకి డ్రోన్​లను పంపిచకూడదంటూ అందులో కోరారు.

ట్రాఫిక్ ఆంక్షలు
దిల్లీ చలో కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన రైతులు బుధవారం నిరసనలు తెలుపుతామని ప్రకటించిన నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు పోలీసులు. దిల్లీలో 144 సెక్షన్‌ అమలు చేసి, రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి డ్రోన్​ కెమెరాలను వినియోగిస్తున్నారు.

ఇంటర్నెట్​ బంద్​
రైతుల ఆందోళనల నేపథ్యంలో హరియాణాలోని అంబాలా, కురుక్షేత్ర, కైతాల్​, జింద్​, హిసార్​, ఫతేహాబాద్​, సిర్సా జిల్లాల్లో వాయిస్​ కాల్​లు మినహా మిగతా అన్నీ మొబైల్​ సేవలను ఫిబ్రవరి 15 వరకు నిలిపివేశారు అధికారులు. మరోవైపు రైతుల డిమాండ్ల అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించి పరిష్కార మార్గాలు చూపే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని బీఎస్​పీ అధినేత్రి మాయావతి బుధవారం డిమాండ్​ చేశారు.

గాయపడ్డ రైతుకు రాహుల్ ఫోన్​
దిల్లీ చలో ఆందోళన సందర్భంగా పోలీసు చర్యలో గాయపడ్డ రైతు గుర్మీత్‌ సింగ్‌తో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఫోన్‌లో సంభాషించారు. దేశంలో అన్నదాతలపై మోదీ సర్కారు నియంతృత్వ వైఖరిని అవలంబిస్తోందని రాహుల్‌ విమర్శించారు. గుర్మీత్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తాము రైతుల పక్షాన ఉన్నామని భయపడ వద్దని ధైర్యం చెప్పారు. గుర్మిత్‌ చికిత్స పొందుతున్న పాటియాలా జిల్లాలోని రాజ్‌పుర పట్టణ ఆస్పత్రికి వెళ్లిన పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ రాజా ఆయన్ని పరామర్శించారు. హరియాణా పోలీసులతో జరిగిన ఘర్షణలో గుర్మీత్‌ గాయపడ్డారు. పంజాబ్‌-హరియాణా సరిహద్దుల్లో పోలీసులు దాడిలో 60 మంది గాయపడ్డారని రైతులు చెబుతున్నారు. మరోవైపు నిరసనకారులు రాళ్లు విసరడంతో డీఎస్పీ సహా 24 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు హరియాణా పోలీసులు వెల్లడించారు

'MSPపై చట్టం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు- రైతులతో చర్చలకు సిద్ధమే'

రణరంగంలా 'దిల్లీ చలో'- బారికేడ్లు తొలగించి దూసుకెళ్తున్న రైతులు! చర్చలకు సిద్ధమన్న కేంద్రం

Last Updated : Feb 14, 2024, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details