Farmers Protest Delhi 2024 : పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత సహా డిమాండ్ల సాధన కోసం దిల్లీ బయలుదేరిన రైతులు పంజాబ్, హరియాణా సరిహద్దుల నుంచి కదలడం లేదు. ఎలాగైనా దిల్లీ చేరాలనే పట్టుదలతో ఐదు రోజులుగా సరిహద్దుల్లోనే భీష్మించారు. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన దిల్లీ చలోను పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి అడపాదడపా ఘర్షణలు జరుగుతున్నాయి.
రైతుల ముసుగులో విధ్వంసం
ఈ క్రమంలోనే కొంతమంది దుండుగులు రైతుల ముసుగులో శంభు సరిహద్దుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. వాటికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. అందులో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఉద్యమం ముసుగులో ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తాజాగా హరియణా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఉన్న నిషేధాన్ని పొడగించింది. హరియాణాలోని 7 జిల్లాల్లో ఫిబ్రవరి 19వ తేదీ అర్థరాత్రి 12 గంటలకు ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఉందని తెలిపింది.
మరోవైపు ఆందోళనల్లో భాగంగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ- ఉగ్రహణ్) పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్ల ఎదుట ధర్నాలను నిర్వహించింది. పార్టీ నేతలైన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సునీల్ ఝాఖడ్, కేవల్ సింగ్ థిల్లాన్‌ల ఇళ్లను ముట్టడించారు. టోల్‌ప్లాజాల వద్దా ఆందోళనలు జరిగాయి. బీకేయూ (చారుని) నేత గుర్నాంసింగ్ చారుని శనివారం ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ ఆదివారం మరోసారి రైతు సంఘాల నేతలతో చర్చలు జరపనున్నారు. ఇలా ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు జరగనుండటం ఇది నాలుగోసారి. ఇప్పటికే ఈ నెల 8న, 12న, 15న మూడు సార్లు చర్చలు జరిగాయి. అవి అసంపూర్ణంగా ముగిశాయి.