Fali S Nariman Passed Away :ప్రముఖ న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్(95) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సిబ్బంది ధ్రువీకరించారు. నారీమన్ బుధవారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు నారీమన్ సన్నిహితవర్గాలు తెలిపాయి. కొంతకాలంగా హృద్రోగంతోపాటు అనేక రుగ్మతలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాయి.
ఎమర్జెన్సీకి నిరసనగా రాజీనామా
బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నారీమన్, సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులు కావడం వల్ల దిల్లీ వెళ్లారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆయనను అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
పద్మభూషణ్, పద్మవిభూషణ్‌తో సత్కారం
1991 నుంచి 2010 వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు నారీమన్ అధ్యక్షుడిగా పనిచేశారు. న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. నారీమన్ మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వంటి న్యాయనిపుణులు సంతాపం ప్రకటించారు.
మోదీ సంతాపం
"ఫాలీ నారీమన్ అత్యుత్తమ న్యాయవాదులు, మేధావుల్లో ఒకరు. సామాన్య పౌరులకు న్యాయం చేయడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మరణ వార్త విని నేను బాధపడ్డాను. ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
రాహుల్, ఖర్గే సంతాపం
రాజ్యాంగ పవిత్రతను నిలబెట్టేందుకు అనేక తరాల న్యాయనిపుణులకు ఫాలీ నారీమన్ స్ఫూర్తినిచ్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొనియాడారు. నారీమన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు, పాలీ ఎస్ నారీమన్ మరణం న్యాయవ్యవ్యస్థ తీరన లోటు అని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. నారీమన్ కుటుంబసభ్యులతోపాటు స్నేహితులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు.
సింఘ్వీ తీవ్ర ఆవేదన!
సుప్రీంకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ సైతం నారీమన్ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణంతో ఒక యుగం ముగిసిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ, ప్రజా జీవితంలో ఉన్నవారి మనసుల్లో నారీమన్ చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొనియాడారు. భారత్ గొప్ప న్యాయవాదిని కోల్పోయిందని, నారీమన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సుప్రీంకోర్టు న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.
22 ఏళ్ల తర్వాత!
మయన్మార్‌లోని రంగూన్లో 1929లో జనవరి 10న ఫాలీ నారీమన్ జన్మించారు. సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఎకనామిక్స్ అండ్ హిస్టరీలో బీఏ పూర్తి చేశారకు. 1950లో గవర్నమెంట్ లా కాలేజీ నుంచి లా పట్టా అందుకున్నారు. బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 22 ఏళ్లపాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత 1971లో భారత సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా నియమితులయ్యారు.
నారీమన్ కుమారుడు కూడా!
1955లో బాప్సీని వివాహం చేసుకున్నారు నారీమన్. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. నారీమన్ కుమారుడు జస్టిస్ రొహింటన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2011 నుంచి 2013 వరకు ఆయన కూడా సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు.
అనేక కేసుల్లో వాదనలు వినిపించి!
నారీమన్ అనేక ప్రతిష్ఠాత్మక కేసుల్లో తన వాదనలను వినిపించారు. భోపాల్ గ్యాస్ విపత్తు కేసులో యూనియన్ కార్బైడ్ కంపెనీకి అనుకూలంగా నారీమన్ వాదించారు. ఆ తర్వాత తన తప్పును అంగీకరించి నష్ట పరిహారం విషయంలో బాధితులకు, కంపెనీకి మధ్య ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించారు. గోలక్ నాథ్ , SP గుప్తా, మొదలైన అనేక ముఖ్యమైన కేసులను వాదించారు. ఇటీవల అధికరణ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన విమర్శించారు.