Fake ED Officers Arrest In Tamil Nadu :ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల్లా నటించి ఓ వస్త్ర వ్యాపారి దగ్గరి నుంచి ఏకంగా రూ.1.69 కోట్లు దోచుకుంది ఓ ముఠా. వ్యాపారికి చెందిన కార్యాలయంలో నకిలీ సోదాలు నిర్వహించిన నిందితులను తమిళనాడు తిరుప్పుర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.10 కోట్లను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులు పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. విజయ్ కార్తిక్ (37), నరేంద్ర నాథ్ (45), రాజశేఖర్ (39), లోగనాథన్ (41), గోపీనాథ్ (46)లను ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చారు.
హైదరాబాద్ నుంచి కాల్
బాధితుడు అంగురాజ్ (52), అతడి స్నేహితుడు దురైకి హైదరాబాద్‌లోని ఒక నిర్మాణ సంస్థ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కోయంబత్తూరు, తిరుప్పుర్‌తో పాటు ఈరోడ్‌లో విస్తరించి ఉన్న తమ కంపెనీకి చెందిన ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెడితే భారీ స్థాయిలో లాభాలు ఆర్జించవచ్చని వీరిని నమ్మించారు కేటుగాళ్లు. వీరి మాటలను నమ్మిన అంగురాజ్, దురై తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల ద్వారా ఏదో విధంగా రూ.1.69 కోట్ల రూపాయలను సేకరించగలిగారు.
మోసపూరిత పథకంలో భాగంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు చెందిన కంపెనీ ప్రతినిధులుగా బాధితులను నమ్మించగలిగారు నిందితులు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి జనవరి 30న ఈడీ అధికారుల అవతారం ఎత్తారు. ప్లాన్ ప్రకారం అంగురాజ్కు సంబంధించిన కార్యాలయానికి వెళ్లి తాము సోదాలు జరిపేందుకు వచ్చిన ఈడీ ఆఫీసర్స్ అంటూ నమ్మించారు. వారు నిజమైన ఈడీ అధికారులని భావించిన యజమాని దాడులకు సహకరించారు. అలా ఫేక్ అధికారుల ముసుగులో ఉన్న నిందితులు నకిలీ దాడులు నిర్వహించి అంగురాజ్ కార్యాలయం నుంచి మొత్తం రూ. 1.69 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని సైతం స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అంగురాజ్, దురైను ఈడీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నిందితులు ఆదేశించారు.