Exit Polls Vs Exact Results In Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దాదాపు అన్ని సర్వే సంస్థల అంచనాలు తారమారయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైన ఫలితాలకు వ్యత్యాసం భారీగా కనిపించింది. అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమి విజయాన్ని ఊహించినప్పటికీ సీట్ల విషయంలో వాటి అంచనాలు బెడిసికొట్టాయి. ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య స్వల్ప మార్పులు ఉంటాయని చెప్పడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయి. బీజేపీ కూటమి 300కు పైగా సీట్లను గెలుచుకుంటుందని అన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా, ఆ మార్కును సైతం అందుకోలేకపోయాయి.
'ఇండియాటుడే యాక్సిస్ మై ఇండియా' సర్వే సంస్థ అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 361-401 సీట్లు వస్తాయని, ప్రతిపక్ష ఇండియా కూటమి 131-166 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ తమ సర్వేలో ఎన్డీఏకు 358, ఇండియా కూటమికి 152 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ పీ మార్క్ సైతం దాదాపు ఇదే సంఖ్యతో ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేసింది. 'టుడేస్ చాణక్య' సంస్థ ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 107 సీట్లు వస్తాయని చెప్పింది. జన్‌కీబాత్ తమ సర్వే ప్రకారం బీజేపీ కూటమికి 390 సీట్లు, ప్రతిపక్ష కూటమికి 161 వస్తాయని పేర్కొంది. న్యూస్ నేషన్ సంస్థ ఎన్డీఏకు 378, ఇండియా కూటమికి 169 సీట్లు వస్తాయని తెలిపింది.
బోల్తా పడినా సర్వేలు
ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బంగాల్, రాజస్థాన్‌లలో ఓటర్ల ఆంతర్యం పసిగట్టడంలో సర్వే సంస్థలు బాగా బోల్తాపడ్డాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఏకపక్షం విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు అంచనా వేయగా కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించి బీజేపీ దూకుడుకు కళ్లెం వేసింది.
సెమీ ఫైనల్ ఎన్నికల్లోనూ!
ఎన్నికల ఫలితాల్లో రాజకీయ పార్టీల అంచనాలు తారుమారవ్వడమనేది ఇదే తొలిసారి కాదు. కొన్నిసార్లు దారుణంగా ఓడిన సందర్భాలూ ఉన్నాయి. గతేడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కొన్ని చోట్ల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు లెక్క బెడిసికొట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం సాధించగా, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, ఎగ్జిట్ పోల్స్ మాత్రం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడతాయని అంచనా వేశాయి. మరోవైపు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలానే జరిగింది. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పలు సర్వేలు తెలిపాయి. కొన్ని సర్వేలు చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
- 2004 లోక్‌సభ ఎన్నికల్లో షైనింగ్ నినాదంతో ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల్లో పోటీచేసింది. అప్పట్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే 240-250 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ వాస్తవానికి 187 ఎన్డీయే స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.
- 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నిస్థానాల్లో గెలుస్తుందనే విషయాన్ని ఏ సంస్థ అంచనా వేయలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఎన్డీయేకు 300 స్థానాలో విజయదుందుభి మోగించింది. ఒక్క బీజేపీయే 272 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 44 సీట్లకే పరిమితమైంది.
- నోట్ల రద్దు తర్వాత 2017లో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వస్తుందని సర్వేలు అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నంగా బీజేపీ 325 స్థానాల్లో విజయఢంకా మోగించింది.
- 2015లో బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, మహాకూటమికి మధ్య గట్టిపోటీ ఉంటుందని సర్వేలు అంచనా వేశాయి. కానీ ఎన్నికల్లో కూటమికి 178 సీట్లు వచ్చాయి. బీజేపీ ఓటమి పాలైంది.
- 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని సర్వేలు అంచనా వేసినప్పటికీ 70 సీట్లకు 67 స్థానాల్లో క్లీన్‌స్వీప్ చేస్తుందని ఎవరూ ఊహించలేకపోవడం గమనార్హం.
ఎన్డీయే కూటమిలో కింగ్ మేకర్స్‌గా చంద్రబాబు, నీతీశ్- రాజకీయంగా ఏపీకి ఎంతో మేలు! - LOKSABHA ELECTION RESULT 2024
మహారాష్ట్రలో NDAకి షాక్- 'ఇండియా' కూటమికి జై- ఉద్ధవ్, శరద్ పక్షానే ప్రజలు! - Lok Sabha Election 2024 Result