Electoral Bonds Regional Parties :ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఎలక్టోరల్ బాండ్ల వివరాల ప్రకారం దేశంలో ప్రాంతీయ పార్టీలకు కూడా భారీగానే లబ్ధి చేకూరినట్లు స్పష్టమవుతోంది. 2019 ఏప్రిల్- 2024 జనవరి మధ్య ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ప్రాంతీయ పార్టీలు రూ. 5,221 కోట్లకుపైగా విరాళాలు అందుకున్నాయి. బీజేపీకి రూ.6,061 కోట్ల విరాళాలు రాగా ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలకే ఎక్కువగా విరాళాలు అందాయి.
భారతీయ జనతా పార్టీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు రూ.839 కోట్లు మాత్రమే తక్కువ కావడం గమనార్హం. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు 1,422 కోట్ల విరాళాలు రాగా, ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం రూ. 65.45 కోట్ల విరాళాలు వచ్చాయి. జాతీయ పార్టీలు, బీఎస్పీ, సీపీఎం, ఎన్‌పీపీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎటువంటి నిధులను పొందలేదు.
ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీకే ఎక్కువ
ప్రాంతీయ పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా రూ.1,609.53 కోట్లు సమీకరించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా టీఎంసీకి వచ్చిన విరాళాలు 22 ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాల్లో 30 శాతం ఉండడం విశేషం. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్కు రూ.1,214.70 కోట్లు, బిజు జనతా దళ్కు రూ.775.50 కోట్లు, డీఎంకేకు రూ.639 కోట్లు, వైసీపీకి రూ.337 కోట్లు, టీడీపీకి రూ.218.88 కోట్లు, శివసేనకు 159.38 కోట్లు విరాళాలుగా అందాయి. మిగతా పార్టీలు ఎంత సమీకరించాయంటే?
ప్రాంతీయ పార్టీ పేరు | అందిన విరాళాలు |
ఆర్జేడీ | రూ.73.5 కోట్లు |
జేడీఎస్ | రూ.43.40 కోట్లు |
సిక్కిం క్రాంతికారీ పార్టీ | రూ.36.5 కోట్లు |
ఎన్సీపీ | రూ.31 కోట్లు |
జనసేన | రూ.21 కోట్లు |
జేడీయూ | రూ.14 కోట్లు |
జేఎంఎం | రూ.13.5 కోట్లు |
ఏఐఏడీఎంకే | రూ.6.05 కోట్లు |
సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ | రూ.5.5 కోట్లు |
మూడు పార్టీలకు కోటి కన్నా తక్కువే
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, గోవా ఫార్వర్డ్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కోటి రూపాయల కంటే తక్కువ విరాళాలు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం 2018 మార్చి నుంచి 2024 జనవరి వరకు రూ.16,518 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను విక్రయించారు.