తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ ఉపఎన్నికలు- నియమావళి ఉల్లంఘించిన ఐదుగురు పోలీసులపై ఈసీ వేటు - UTTAR PRADESH BYPOLLS

యూపీ ఉపఎన్నికలు- నిబంధనలు ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిపై ఈసీ వేటు- ఝార్ఖండ్​లో ప్రిసైడింగ్ ఆఫీసర్​ను మార్చిన అధికారులు

Uttar Pradesh Bypolls police Suspend
Uttar Pradesh Bypolls police Suspend (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2024, 3:33 PM IST

Uttar Pradesh Bypolls police Suspend : ఉత్తర్​ప్రదేశ్‌ ఉపఎన్నికల్లో ఈసీ నియమావళిని ఉల్లంఘించిన ఐదుగురు పోలీసులపై వేటు పడింది. ఓ నిర్దిష్ట వర్గానికి చెందిన ఓటర్లను తనిఖీ చేయడం, ఓటు వేయకుండా ఆపడంపై అందిన ఫిర్యాదుల మేరకు ఈసీ వారిపై చర్యలు తీసుకుందని అధికారులు తెలిపారు. మరికొందర్ని ఎన్నికల విధుల నుంచి తప్పించిందని పేర్కొన్నారు.

సమాజ్ వాదీ పార్టీ ఫిర్యాదు
ఉప ఎన్నికల్లో ఓ నిర్దిష్ట వర్గానికి చెందినవారిని ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని పోలీసులపై సమాజ్​వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఈసీకి ఫిర్యాదు చేశారు. సాక్ష్యంగా ఓ వీడియోను కూడా ఈసీకి పంపారు. ఈ క్రమంలో ఎన్నికల నియామావళిని ఉల్లంఘించిన ఐదుగురు పోలీసులపై వేటు వేయాలని ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారికి సీఈసీ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీ ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. వేటుపడినవారిలో ఒక సబ్​ ఇన్‌ స్పెక్టర్‌, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.

'పక్షపాత వైఖరిని సహించేది లేదు'
అన్ని ఫిర్యాదులను వెంటనే పరిగణనలోకి తీసుకుని, సత్వర చర్యలు చేపట్టాలని రాజీవ్ కుమార్ తెలిపారు. అర్హులైన ఓటరును ఓటు వేయకుండా అడ్డుకోవద్దని, ఎలాంటి పక్షపాత వైఖరిని సహించేది లేదని హెచ్చరించారు. ఫిర్యాదు అందిన తర్వాత ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల యంత్రాంగానికి సూచించారు.

ప్రిసైడింగ్ ఆఫీసర్​ను మార్చిన అధికారులు
అధికార పార్టీ జేఎంఎం అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించినందుకు దేవ్​​ఘర్ ప్రిసైడింగ్ అధికారి రామానంద్ పాశ్వాన్​ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో వేరే అధికారిని ప్రిసైడింగ్ ఆఫీసర్​గా నియమించారు. అధికార జేఎంఎం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ రామానంద్​పై చర్యలకు ఉపక్రమించింది.

బీజేపీ ఎంపీ ఫిర్యాదుతో!
ప్రిసైడింగ్ అధికారి అండతో ఓ పదేళ్ల చిన్నారితో జేఎంఎం నాయకులు ఓటు వేయిస్తున్నారని నిషికాంత్ దూబే ఆరోపించారు. మధుపుర్ పోలింగ్ బూత్ 111లో ప్రిసైడింగ్ అధికారి జేఎంఎంకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా ఈసీని కోరారు. దీంతో రామానంద్​పై ఈసీ చర్యలు తీసుకుంది.

ABOUT THE AUTHOR

...view details